పాల సముద్రంలో శేషతల్పంపై ధ్యాన ముద్రలో ఉన్నాడు విష్ణుమూర్తి. శ్రీవారి సేవలో ఉన్న లక్ష్మీదేవి ఉన్నట్టుండి ఓ ప్రశ్న వేసింది‘‘నాథా…శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారు కదా. భూలోకంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది… గుట్టలు గుట్టలుగా శవాలు పడుతున్నాయి. బలాదూరు తిరిగే మనిషి ఇల్లు అనే బందిఖానాలో పడిపోయాడు. యుగాంతం వచ్చేసిందా… మిమ్మల్నే నమ్ముకున్న ఈ మనుషుల్ని మీరేం రక్షించలేరా?… అసలు ఈ సృష్టి అంతమా… అనంతమా? అందరూ మీలా ఇంట్లో ఇలా పడుకుంటే ఈ సృష్టి ముందుకు సాగేదెలా?’’ అనడిగింది.
‘‘దేవీ.. డాక్టర్ సమరం కూడా సమాధానం చెప్పలేని ప్రశ్న అడిగావు. రాత్రి- పగలు, సత్యం- అసత్యం, పాపం- పుణ్యం… ఇలాంటి ద్వాంద్వాలు ఉంటేనే సృష్టి ముందుకు సాగుతుంది. సృష్టించేవాడు బ్రహ్మ, పాలించేది నేను, నాశనం చేసేది శివుడు. ఆ టైమ్ వచ్చిందేమో అందుకే శివుడు ఇలా చేస్తున్నాడు. అయినా జనం మనల్ని నమ్మారు కాబట్టి వారికోసం మనం కూడా ఏదో ఒకటి చేయాలి. రేపే ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేస్తా’’ అన్నాడు విష్ణుమూర్తి.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ సమావేశమయ్యారు.
‘‘ఈశ్వరా… కలియుగం అంతానికి ఇంకా సమయం ఉంది కదా… ఎందుకిలా చేస్తున్నావు?’’ అనడిగాడు బ్రహ్మ.
‘‘బ్రహ్మాజీ… మీ కళా నైపుణ్యానికి నా జోహార్లు. మీరు ఎంతో అందమైన సృష్టి చేశారు. కానీ ఈ మనిషికి మీరు మనకున్న తెలివితేటలన్నీ ఇచ్చేశారు… అవి ఎక్కువై వారు మనకే ముప్పుతెచ్చి పెడుతున్నాయి. మీరు చేసిన మంచి పని ఏమిటంటే మనిషి కంటికి కనిపించని జీవుల్ని సృష్టించడమే. కనిపించిన ప్రతిదాన్నీ అతను తినిపారేస్తున్నాడు. ఇలా చేస్తే ఈ భూమ్మీద ఇంకేమీ మిగలదు. అందుకే మీరు సృష్టించిన కరోనానే వారి మీద ఆయుధంగా వదిలాను’’ అన్నాడు పరమశివుడు.
‘‘మంచోడి బుద్ధి మాంసం కాడే తెలుస్తుందంటే ఏంటో అనుకున్నా… ఇన్ని ప్రాణాలు పోతున్నా ఈ మనిషికేమీ భయంలేదు.. అదిగో అటు చూడండి… ఆ మార్కెట్లో గబ్బిలాల కోసం ఎలా ఎగబడుతున్నారో. ఇటు చూడండి వేదభూమి అయిన మన భారత దేశంలో ఆ చేపల మార్కెట్లో సందడి… శివుడి నిర్ణయం సరైనదే. అయినా ఈ కల్లోలాన్ని ఇక ఆపేద్దాం. మన యమధర్మరాజును పిలిపించండి’’ అన్నాడు విష్ణుమూర్తి.
ఆజ్ఞాపించడమే తరువాయి యమధర్మరాజు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
‘‘యమా… ఎలా ఉంది నీ సామ్రాజ్యం?’’ అడిగారు త్రిమూర్తులు.
‘‘ఏం సామ్రాజ్యం ప్రభూ… నరకం నిండిపోయింది. స్వర్గానికి పంపేద్దామనుకుంటే కేసులన్నిటినీ చిత్రగుప్తుడు కేసులన్నిటినీ ఇక్కడికే రిఫర్ చేస్తున్నాడు. ఆయనకు గిట్టుబాటు కాక ఇలా చేస్తున్నాడేమో అనిపిస్తోంది. అతని మీద మీరు దర్యాప్తు జరిపించండి’’ అన్నాడు యమధర్మరాజు. చిత్రగుప్తుడిని పిలిపించండి అనగానే అతనక్కడ ప్రత్యక్షమయ్యాడు.
‘‘ఏం జరుగుతోంది చిత్రగుప్తా… మీమీద అభియోగాలు ఎక్కువవుతున్నాయి. మీకు ఆమ్యామ్యాలు ఇవ్వకపోవడం వల్లే అందరినీ నరకానికి నెట్టేస్తున్నారని యమధర్మరాజులవారు అంటున్నారు… ఏంటి సంగతి?’’ విష్ణుమూర్తి ప్రశ్నించాడు.
‘‘ప్రభూ… నాకే పాపమూ తెలియదు. పాపాలు చేసేవారే ఎక్కువవడంతో నరకం నిండిపోయింది. బతికుంటే బలుసాకైనా తిని బతుకుతానుగానీ నేను కూడా ఈ నరక జీవితాన్ని కోరుకుంటానా ప్రభూ’ అన్నాడు చిత్రగుప్తుడు.
‘‘నాకీ నరకం వద్దు ప్రభూ… నేను రిజైన్ చేస్తున్నాను’’ అన్నాడు యమధర్మరాజు.
‘‘ముందు కరోనా సంగతి చూడండి… తర్వాత మీ సంగతి మేం చూస్తాం’’ అన్నారు త్రిమూర్తులు.
కట్ చేస్తే కరోనా ముందు యమధర్మరాజు తన యమకింకరులతో వాలాడు.
‘‘రా పోదాం… ’’ అన్నాడు యమధర్మరాజు.
‘‘ఎక్కడికి?’’ ఎదురు ప్రశ్నించింది కరోనా.
‘‘యముండ… నరకానికి’’ అన్నాడు యమధర్మరాజు.
‘‘నన్నెవరూ ఏమీ చేయలేరురా’’ అంది కరోనా ఆగ్రహంతో.
‘‘ఈ అరుంధతి డైలాగులే వద్దన్నా.. నీకేమైనా కొమ్ములున్నాయా?’’ యమధర్మరాజు ప్రశ్న.
‘‘నా కొమ్ములు కనపడటం లేదా… ఏ నీ భటులకే కొమ్ములుండాలా?’’ ఎదురు ప్రశ్నించింది కరోనా.
‘‘నేనేమైనా కరీనా అనుకున్నావా… ఏ ముండా నన్ను టచ్ చేయలేరు’’ అంది కరోనా.
‘‘నువ్వు మనిషివి కాదు… కరోనావి… ఆ సంగతి గుర్తుంచుకో’’ అన్నాడు యముడు.
‘‘నన్ను టచ్ చేసి చూడు నీకే తెలుస్తుంది’’ అంది కరోనా ఉగ్రరూపంతో ఊగిపోతూ.
యమధర్మరాజు అహం దెబ్బతింది. ‘‘నాతో ఈ సినిమా డైలాగులు చెప్పొద్దు’’ అంటూ ఆవేశంగా కరోనాను పట్టుకున్నాడు. ‘‘వామ్మో…’’అంటూ దగ్గుతూ తుమ్ముతూ కుప్పకూలిపోయాడు.
ఇల భూలోకములో…
ఉలిక్కిపడి లేచాను…
ఇంట్లో మంచం మీదే ఉన్నా…
‘ఓహో ఇది కలా’ అనుకున్నా… టైమ్ చూద్దామని ఫోన్ తీశా.
అందులో షేర్ ఛాట్ నుంచి మెసేజ్ ‘మిస్టర్ ! టైమ్ చూడు… ఒకసారి పడుకో’ అని. తెల్లవారు జామున నాలుగు గంటలైంది.
‘బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలని పెద్దలంటే… ఇది పడుకో అంటోందేంటి… యాప్ లు వచ్చాక చాలా గ్యాప్ వచ్చేసింది’ అనుకున్నా. మళ్లీ కళ్లుమూసుకున్నా… నిద్రపట్టేసింది.
మా ఆవిడ కుదుపుతోంది ‘‘ఏవండీ ఇంకా తెల్లారలేదా… ఎనిమిదైంది చూడండి’’ అంది.
లేద్దామనుకుంటుండగా బయటి నుంచి మా ఆవిడ అరుపులు.
‘‘అప్పుడే తెల్లారిందా… పో పో’’ అని తిడుతోంది.
‘నాతో ఇంకా తెల్లారలేదా అంది. అతని దగ్గర అప్పుడే తెల్లారిందా అంది… కల గుర్తొచ్చింది మనిషిలో ఈ ద్వంద్వాలు సహజమే’ అనుకున్నా.
‘‘ఎలాగూ పనీ పాటా లేదుగా మొహం కడుక్కుని తగలడు… టిఫిన్ పారేస్తా’’ అంది విసుగ్గా. ‘దీనికన్నా ఆ కరోనానే నయం’ అనుకున్నా.
‘‘రాత్రి కలలోకి లక్ష్మి వచ్చిందే’’ అనేసి నాలుక్కరుచుకున్నా.
‘‘వచ్చిందా… మొన్న ఫోన్లో ఎవరితోనే ఈ అమ్మాయి… ఆ అమ్మాయి అంటుంటేనే అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతోందని’’ రుసరుసలాడింది.
‘‘ అది అమ్మాయి కాదే… ఈఎంఐ… బండి లోన్ వాయిదా కట్టాలిగా. మారటోరియం విధించారుగా కట్టకపోయినా ఫర్లేదు’’ అన్నా. ఈలోగా ఇంటి ముందుకు గ్రామ వాలంటీరు వచ్చాడు. ‘‘ఇవిగోండి రెండు వేలు. కరోనా కదా గవర్నమెంటు ఇచ్చింది’’ అంటూ రెండు వేలు మా ఆవిడ చేతిలో పెట్టాడు. మళ్లీ మా ఆవిడ మొహంలోకి లక్ష్మీకళ వచ్చింది.
హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. కలలో లక్ష్మీదేవి విష్ణుమూర్తికి సేవలు చేస్తూ కనిపించిందికానీ ఇక్కడ మాత్రం నాకీ వేధింపులు తప్పవు. నేనెలాగూ ఇంట్లోనే ఉన్నా… నా కల మాత్రం కంచికి చేరిపోయింది.