తెలంగాణలో కొలువుల విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ అధికార టీఆర్‌ఎస్‌పై విరుచుకుపడింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ నినాదాలతో ఉద్భవించిందని, తెలంగాణ రాష్ట్రం సిద్దించి ఏడేళ్లు అవుతున్నా దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ నియామకాలు చేపట్టకుండా తప్పుల తడకలతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి చుక్కలు చూపించేలా ధర్నాలతో , రాస్తారోకోలతో ఆందోళనలను చేపట్టింది బీజేపీ.
యువమోర్చా ర్యాలీకి యత్నం
ఈరోజు ఉదయం నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ర్యాలీగా టీపీపీఎస్సీ ని ముట్టడించడానికి యువమోర్చా నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కార్యకర్తలు. కార్యకర్తలు అటు వెళ్లకుండా పార్టీ కార్యాలయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. యువమోర్చా కార్యకర్తలను అడ్డుకోవడమే కాకుండా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
యువతను ప్రలోభ పెడుతున్న టీఆర్ఎస్..
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువతను మభ్యపెడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటం, త్వరలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరగనుండటంతో లక్షా 30 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లుగా, మరో 50 వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లుగా టీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం అవాస్తవం అంటూ బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వరంగల్ -ఖమ్మం – నల్గొండ, హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పట్టభద్రులను ప్రలోభ పెట్టడానికి రాబోయే రోజుల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నట్లుగా, తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా ఫోన్ కాల్స్ చేస్తూ యువతను ప్రలోభపెడుతున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : మారుతున్న నేతల స్వరం.. బీజేపీ, జనసేన జట్టు కట్టేనా