వైరి పక్షాలకు కేసీఆర్ షాక్ ఇస్తూ ఉమ్మడి మహబూబ్‌నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభి వాణీ దేవిని ఖరారు చేశారు. నిన్నటివరకు టీఆర్ఎస్ బరిలో ఉండేందుకు విముఖత చూపుతోందని, సీనియర్ ఎమ్మెల్సీకి ఇక్కడ పరోక్షంగా మద్దతు ఇవ్వనుందని పార్టీనాయకులతోనే కొన్ని లీకులు బయటకు వచ్చినా..ఆదివారం టీఆర్ఎస్ తన అభ్యర్థిని ఖరారు చేసింది. కాగా సురభి వాణీ నామినేషన్ వేసేందుకు సోమవారం సమయం మించిపోవడంతో మంగళవారం నామినేషన్ వేయనున్నారు. కాగా సురభి వాణికి టిక్కెట్ కేటాయించడంపై ఆ కుటుంబానికే చెందిన బీజేపీ నేత విమర్శలు చేయగా పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్‌లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు కూడా విమర్శలు చేశారు. ఈ నియోజకవర్గంలో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఓడిపోతామని తెలిసీ కేసీఆర్ ఇలాంటి డ్రామాకు తెరలేపారని విమర్శించారు. ఇక్కడ స్వయంగా కేసీఆర్, కేటీఆర్ వచ్చి నిలబడినా ఓడిపోవడం ఖాయమని వైరిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకే పీవీ కుమార్తెకు టిక్కెట్ ఇచ్చారని, సామాజికవర్గాల వారీగా ఓట్లు విభజించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
మహా మనిషి పేరు చెప్పి మోసం..
పీవీ నరసింహారావు మనుమడు, బీజేపీ నేత ఎన్వీ సుభాష్ మాట్లాడుతూ కేసీఆర్ కుటిల రాజకీయాలు చేస్తున్నారని, మహా మనిషి పేరు చెప్పి మోసం చేస్తున్నారని విమర్శించారు. సామాజికవర్గ ఓట్లు చీల్చడానికి కేసీఆర్ ఈ కుట్ర చేశారని విమర్శిస్తున్నారు. కేసీఆర్‌కి పీవీపై అంత ప్రేమ ఉంటే రాజ్యసభ సీటు లేదా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీటు ఇవ్వచ్చు కదా అని వ్యాఖ్యానించారు. ఇక పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు మాట్లాడుతూ కేసీఆర్ చేస్తున్న కుట్రలను అటు పీవీ కుటుంబంతోపాటు యువత కూడా తెలుసుకోవాలన్నారు. యువతకు ఎలాంటి ఉపాధి మార్గాల చూపించారో చెప్పకుండా..కేవలం ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శించారు.
Must Read ;- భాష, టైమింగ్.. ప్రజలను ఆకట్టుకోవడంలో దిట్ట కేసీఆర్
వ్యూహాత్మక జాప్యమా..
కాగా పీవీ నరసింహారావు జయంతి ఉత్సవాలను కొన్నాళ్ల క్రితం కేసీఆర్ ప్రారంభించారు. అప్పట్లోనే వారి సేవలకు గుర్తింపుగా పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే నామినేటెడ్ పదవి లేదా పరోక్షంగా గెలుపు ఖరారైన పదవి ఇస్తారని అంతా భావించారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిపారు. నామినేషన్లకు చివరి రెండు రోజులకు ముందు పేరును ప్రకటించి షాక్ ఇచ్చారు. కాగా కేసీఆర్ ప్రధాన టార్గెట్ ఏంటనే అంశంపై చర్చ నడుస్తోంది.
వ్యూహాలు ఇవేనా..
కాగా సురభి వాణి ఎంపిక విషయంలో టీఆర్ఎస్ వ్యూహాలు ఏంటనే చర్చ నడుస్తోంది. ఆ అంశాలను పరిశీలిస్తే.
- సిట్టింగ్ ఎమ్మెల్సీ , బీజేపీ నేత రామచంద్రరావుది అదే సామాజిక వర్గం. బరిలో ఉన్న మరో ఇద్దరిది కూడా అదే సామాజికవర్గం.
- ఇక పీవీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వలేదని, తామే గుర్తింపు ఇచ్చామని ప్రచారం చేసుకోవచ్చు. ఈ రకంగా కాంగ్రెస్, బీజేపీలను విమర్శించవచ్చు.
- ప్రస్తుతం పీవీ కుమార్తె శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్నారు. గతంలో జేఎన్ టీ యూలో పనిచేశారు. విద్యార్థుల ఓట్ల విషయంలో ఈ అంశాలు కలసి వస్తాయని టీఆర్ఎస్ భావిస్తోంది.
- ఇక మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున చిన్నారెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, టీడీపీ నుంచి ఎల్ రమణ, స్వతంత్ర అభ్యర్థిగా నాగేశ్వర్, ఆర్ ఎల్ డీ నుంచి తెలంగాణ ఉద్యమకారుల్లో ఒకరైన కపిలవాయి దిలీప్ కుమార్ తదితరులు బరిలో ఉన్నారు.
5 లక్షల ఓట్లు..
- కాగా ఈ నియోజకవర్గంలో 5.17లక్షల మంది ఓటర్లు నమోదు చేయించుకున్నారు. ఇందులో మొదటి ప్రాధాన్య ఓటు, రెండు ప్రాధాన్య ఓటు ప్రకారం విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిర్ణీత పోలింగ్ శాతంలో మెజార్టీ శాతం మొదటి ప్రాధాన్యం, రెండో ప్రాధాన్యం ఓటును తాము రాబట్టుకుంటే విజయం సాధ్యమవుతుందని టీఆర్ఎస్ భావించినట్టు తెలుస్తోంది.
- Also Read ;- మోడీ పేరెత్తితే కేసీఆర్‌కు వణుకు: రేవంత్