దివంగత అతిలోక సుందరి శ్రీదేవి భారతీయ సినీ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా ఓ వెలుగు వెలిగిన విషయం జగద్విదితం. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్లో సైతం అనేక చిత్రాలు చేసి ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు. మొదట్నుంచి తన ఉన్నతికి కారణమైన తెలుగు చిత్ర పరిశ్రమపై ఆమెకు ప్రత్యేక అభిమానం ఉండేది. తన పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ను హిందీ చిత్ర సీమకు పరిచయం చేసినప్పటికీ, తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తే జాన్వీ ని నటింపజేయాలని శ్రీదేవి భావించింది కూడా. జాన్వీ బాలీవుడ్లో నటించిన తొలి చిత్రం `ధఢక్ ‘ ఘన విజయాన్ని శ్రీదేవి కన్నులారా చూడకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
శ్రీదేవి జీవించి ఉన్నప్పుడు జాన్వీ ఫలానా చిత్రంలో నటించబోతున్నట్లు టాలీవుడ్లో రకరకాల కథనాలతో వార్తలొచ్చాయి. అప్పట్లో జూ.ఎన్ఠీఆర్ చిత్రంలో ఆయన సరసన నటించబోతున్నట్టు, ఇంకా నిర్మాత దిల్ రాజు నిర్మించే చిత్రంలో నటిస్తుందని, అలాగే రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో నటిస్తుందని కొంతకాలం పాటు వార్తలు వెల్లువెత్తాయి. కానీ జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇంతవరకు ఊహాగానాలకే పరిమితమైంది. మరోవైపు జాన్వీ కి బాలీవుడ్లో అవకాశాలపై అవకాశాలు వస్తున్నాయి.
అయితే ఆమె మాత్రం ఆచితూచి సినిమాలను అంగీకరిస్తోందట. ఈ నేపథ్యంలో ఇప్పట్లో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ జరిగే అవకాశాలు దాదాపుగా లేవని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. దఢక్ తర్వాత `గుంజన్ సక్సేనా’ చిత్రంలో నటించిన ఆమె తాజాగా `రూహీ ఆఫ్జానా’లోను, `దోస్తానా-2’లోను నటిస్తోంది. ఇదిలావుండగా.. తమిళంలో నయనతార నటించిన `కొలమావు కోకిల’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఈ రీమేక్ లో జాన్వీ నటించబోతోంది. సిద్దార్థ్ సేన్ గుప్త దర్శకత్వం వహించే ఈ చిత్రం చిత్రీకరణ జనవరిలో మొదలు కానుంది.