వైసీపీ నేత, గుంటూరుకు చెందిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ హైకోర్టును తప్పుదారి పట్టించినట్లు పోలీసులు గుర్తించారు. తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి ఓ కేసులో మధ్యంతర బెయిల్ పొందిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఇప్పుడు పోలీసు, న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, వారి కుటుంబసభ్యులే టార్గెట్‌గా సోషల్‌మీడియాలో బూతులతో రెచ్చిపోయారు.
అనంతపురంలో నమోదైన ఓ కేసులో అరెస్టయి..రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్‌కుమార్ తన తల్లి పద్మావతి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెను చూసుకునేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 14న హైకోర్టులో పిటిషన్ వేశాడు. పరిశీలించిన న్యాయస్థానం ఆ నెల 15 నుంచి 28 వరకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. 28వ తేది సాయంత్రం 5 గంటలలోపు జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు.
ఐతే మార్చి 1న అనిల్‌కుమార్ మరో పిటిషన్ వేశాడు. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిలును పొడిగించాలని కోరాడు. పిటిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..పద్మావతికి బోరుగడ్డ ఒక్కడే కుమారుడని, ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నందున ఆమెకు రెండు వారాలపాటు వైద్య సాయం అవసరం ఉందన్నారు. ఈ వాదనలకు బలం చేకూరేలా గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ ఇచ్చారంటూ మెడికల్ సర్టిఫికెట్‌ను కోర్టు ముందు ఉంచారు. ఆమె ఆరోగ్యం క్షీణించిందని, చికిత్స కోసం చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉందని సర్టిఫికెట్లో పేర్కొన్న విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు.
పోలీసుల తరపు వాదనలు వినిపించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్..మెడికల్ సర్టిఫికెట్ వాస్తవికత విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఏపీపీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు..మెడికల్ సర్టిఫికెట్ వాస్తవికతను తేల్చేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చారు. అది తప్పుడు ధ్రువపత్రం అని తేలితే న్యాయస్థానం తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. మార్చి 11 వరకు అనిల్‌కు మధ్యంతర బెయిలు ఇచ్చారు. ఆ రోజు సాయంత్రంలోగా జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించారు.
ఐతే అనిల్‌కుమార్ తల్లి పద్మావతి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొంది ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయ్యారని తెలుసుకున్న పోలీసులు. మధ్యంతర బెయిలు పొడిగించాలని మార్చి 1న అనిల్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశాడు? అసలు వారు ఎక్కడ ఉంటున్నారని ఆరా తీయడం ప్రారంభించారు. మధ్యంతర బెయిలు ఉత్తర్వులను పరిశీలించిన పోలీసులు పద్మావతి ఆరోగ్యానికి సంబంధించి గుంటూరు లలితా ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. తాము ఎలాంటి పత్రం ఇవ్వలేదని తమ వద్ద ఆమె చికిత్స పొందలేదని చెప్పడంతో అనిల్ మోసం బయటపడింది. తాము ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ జారీ చేయలేదని ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ పోలీసులకు వాంగ్మూలమిచ్చారు.
దీంతో అనంతపురం, గుంటూరు జిల్లా పోలీసులు రెండు రోజుల నుంచి బోరుగడ్డ ఎక్కడ ఉంటున్నారని ఆరా తీస్తున్నారు. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లతో న్యాయస్థానాన్ని మోసగించిన అనిల్ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరో కేసు నమోదయ్యే అవకాశం ఉంది. గతంలో గుంటూరు పోలీసులు అనిల్‌ను రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తూ మార్గమధ్యలో హోటల్‌కు తీసుకెళ్లి బిర్యానీ పెట్టించిన విషయం సోషల్‌మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ ఇష్యూలో ఏడుగురు సిబ్బంది సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత అరండల్ పేట పోలీసులు ఆయనను పోలీసు కస్టడీలోకి తీసుకుని స్టేషన్‌లో రాచమర్యాదలు చేయడంతో నలుగురుని సస్పెండ్ చేసి ఇన్‌స్పెక్టర్‌ను వీఆర్‌కు పంపారు.