బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. పేరు వింటేనే.. ఓ రేంజి దూకుడుతో సాగుతున్న యువ రాజకీయ వేత్తనే మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి సోదరుడి కుమారుడే ఈ సిద్ధార్థ రెడ్డి. కడప జిల్లాకు కుటుంబం వలసపోయినా.. రాజకీయాల్లోకి ఎంట్రీ కోసం సిద్ధార్థ రెడ్డి కర్నూలు జిల్లానే ఎంచుకున్నారు. అయితే ఆయన పెదనాన్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి మాదిరిగానే.. డీలిమిటేషన్ సిద్ధార్థ రెడ్డి స్పీడుకు కళ్లెం వేసిందని చెప్పాలి. బైరెడ్డి రాజశేఖరరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన, ఆయన సొంతూరు ఉన్న నందికొట్కూరు ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ డ్ గా మారిపోయింది. వెరసి అటు సీనియర్ బైరెడ్డి అయినా, ఇటు బైరెడ్డి జూనియర్ అయినా.. తమ తరఫున ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలను నిలబెట్టేసి వారు మాత్రం తెర వెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు.
మూడు ముక్కలాట
నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్ డ్ మారిన నాటి నుంచి అక్కడ టీడీపీ గెలవలేదనే చెప్పాలి. 2009లో కాంగ్రెస్ గెలిస్తే.. 2014,2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అంటే.. ఈ నియోజకవర్గం వైసీపీ ఫోల్డ్ లో ఉన్నట్లే లెక్క. అసలే అధికార పార్టీ.. ఆపై యువరక్తంతో దూసుకెళుతున్న సిద్ధార్థ రెడ్డి.. వెరసి నందికొట్కూరు వైసీపీలో ఇప్పుడు రచ్చ రంబోలానే జరుగుతోంది. ఎమ్మెల్యే అంటే సిద్ధార్థరెడ్డికి పడదు.. బైరెడ్డి అంటే ఎమ్మెల్యేకు పడదు.. మరోవైపు ఓ మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి పట్టును నిలుపుకునే యత్నాలు.. వెరసి అక్కడ రాజకీయం రసవత్తరంగా సాగుతోందనే చెప్పాలి.
జిల్లాపై ఆధిపత్యం దిశగా..
తాజాగా సిద్ధార్థ రెడ్డికి జగన్ సర్కారు.. ఏపీ శాప్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. శనివారం నాడు ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, సంస్థలకు పాలకవర్గాలను కేటాయిస్తూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో బైరెడ్డికి కీలకమైన శాప్ చైర్మన్ పదవి దక్కింది. అంటే..రాష్ట్రంలో క్రీడల పురోభివృద్ధికి, యువత నవ వికాసానికి కృషి చేసే పోస్టు అన్నమాట. ఏ పదవి లేకున్నప్పుడే నందికొట్కూరుపై తనదైన శైలి ఆధిప్యతం చెలాయించేందుకు యత్నించిన బైరెడ్డి.. ఇప్పుడు రాష్ట్ర స్థాయి పదవితో జిల్లా మొత్తం మీద ఆధిపత్యం కోసం యత్నించే అవకాశాలు లేకపోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాలో నేతలు చాలా మందే ఉన్నా.. పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలిగే నేత ఒక్కరంటే ఒక్కరు కూడా వైసీపీలో లేరనే చెప్పాలి. ఇదే విషయాన్ని గ్రహించిన బైరెడ్డి జూనియర్.. జిల్లాపై ఆధిపత్యం కోసం ఇంకెంత రచ్చ చేస్తారోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా పరిణామాలతో కర్నూలు వైసీపీలో రచ్చ రచ్చ తప్పదేనన్న వాదనలూ వినిపిస్తున్నాయి.










