వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జూలై టెన్షన్ వెంటాడుతోందని చెప్పుకున్నాం కదా. అందుకు అనుగుణంగానే ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు రెండు సార్లు విచారణ జరిపింది. మలి దర్యాప్తును ఈ నెల 26కు వాయిదా వేసింది. ఆ రోజున తుది తీర్పు ప్రకటిస్తామంటూ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. ఆ రోజున జగన్ బెయిల్ గనుక రద్దు అయితే ఆయన మాజీ సీఎంగా మారిపోతారు. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై లెక్కలేనన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే సరిగ్గా.. అదే రోజు మరో దక్షిణాది రాష్ట్రం కర్ణాటకకు సీఎంగా కొనసాగుతున్న బీఎస్ యడియూరప్ప కూడా మాజీగా మారనున్నారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా ఒకే రోజు.. అది కూడా ఇదే నెలలో.. రెండు దక్షిణాది రాష్ట్రాల సీఎంలు మాజీలుగా మారిపోతారన్న వాదనలు కలకలమే రేపుతున్నాయి.
జగన్ బెయిల్ రద్దు అయితే..
ఏపీ సీఎం జగన్ విషయానికి వస్తే.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఇప్పటికే జగన్ 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఎలాగోలా బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చారు. బెయిల్ పై ఉంటూనే ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అదేంటో గానీ.. ఎక్కడైనా విపక్షాలు సీఎంలను ఇబ్బంది పెడతాయి గానీ.. జగన్ విషయంలో సొంత పార్టీ ఎంపీనే జగన్ బెయిల్ రద్దయ్యేలా చేస్తున్నారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇప్పటికే పలు దఫాలుగా విచారణ సాగగా.. రఘురామ పిటిషన్ పై జగన్ కౌంటర్, దానిపై రఘురామ మళ్లీ కౌంటర్ దాఖలయ్యాయి. అయితే జగన్ ను అరెస్ట్ చేసిన సీబీఐ మాత్రం ఇప్పటిదాకా తన అభిప్రాయాన్ని కోర్టుకు తెలపలేదు. ఈ నెల 26న తన వాదనను వినిపిస్తానని సీబీఐ చెప్పగా.. కోర్టు అందుకు ఒప్పుకుంది. అయితే ఆ రోజే తుది తీర్పు ప్రకటిస్తామని కూడా కోర్టు తేల్చి చెప్పింది. అయితే గతంలో జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ పలుమార్లు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసిన సీబీఐ.. అందుకు విరుద్ధంగా ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు చేయొద్దని చెప్పే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తంగా జగన్ బెయిల్ రద్దా? కొనసాగింపా? అన్నది ఈ నెల 26న తేలిపోనుంది.
యడ్డీ రాజీనామా తప్పదా?
ఇదిలా ఉంటే.. సరిగ్గా ఈ నెల 26ననే కర్ణాటక బీజేఎల్పీ భేటీ జరగనుంది. ఈ భేటీలో సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేయనుండగా.. ఆయన ప్లేస్ లో వేరొకరిని ఆ భేటీ ఎన్నుకుంటుందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం నాడు ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా అనారోగ్య కారణాల రీత్యా సీఎం పదవికి రాజీనామా చేస్తానని యడియూరప్ప తెలియజేశారని విశ్వసనీయ సమాచారం. సీనియర్ నేత అయిన యడ్డీపై వేటు గట్రా లేకుండా మర్యాదపూర్వకంగానే ఆయనను సాగనంపే బీజేపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయని తెలుస్తోంది. ఇక తదుపరి ప్రక్రియగా.. యడియూరప్ప రాజీనామా దాదాపు ఖరారైందన్న వార్తల నడుమ స్వయంగా ఆయనే 26న బీజేఎల్పీ భేటీకి పిలుపునిచ్చిన వైనం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. అదే సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుదని తెలుస్తోంది. అయితే యడ్డీ వర్గం మాత్రం, ఆయన రాజీనామా చేయబోరని, సీఎంగా బాధ్యతలు చేపట్టి జులై 26తో రెండేళ్లు పూర్తవుతాయి కాబట్టి ఆ సందర్భంగా మాత్రమే బీజేఎల్పీ సమావేశం జరుగనుందని వాదిస్తున్నారు. మొత్తంగా బెయిల్ రద్దు భయంతో జగన్.. సీఎం పదవికి రాజీనామా చేస్తారన్న వార్తల నేపథ్యంలో దక్షిణాదికి చెందిన రెండు రాష్ట్రాల సీఎంలు పదవీచ్యుతులు కాబోనున్నారన్న వార్తలు అమితాసక్తి రేకెత్తిస్తున్నాయి.











