నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ సినిమా విడుదలై ఈ జులై 18 నాటికి 30 ఏళ్లు పూర్తిచేసుకుంటుంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తన శ్రీమతి అనితాకృష్ణ పేరు మీద ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. తెలుగు ప్రేక్షకులు ‘టైమ్ మెషీన్’ అనే మాటను పెద్దగా వినని రోజుల్లో, ఆ నేపథ్యంలో తొలిసారిగా వచ్చిన ‘సైన్స్ ఫిక్షన్’ మూవీ ‘ఆదిత్య 369’ అని చెప్పాలి. మరోలా చెప్పాలంటే ఆనాటి పాన్ ఇండియా సినిమా ఇది. బాలకృష్ణ – మోహిని జంటగా ఓ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ కు సింగీతం తెరతీశారు. 1991లో జులై 18న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 30 ఏళ్ల నాటి ఆ అనుభూతులను మరోసారి ఆస్వాదిద్దాం.

కథలోకి వెళితే..
రాజవర్మ (అమ్రిష్ పురి)కి ప్రాచీనకాలంనాటి ఖరీదైన వస్తువులను అక్రమంగా సొంతం చేసుకోవడం అలవాటు. అలా ఆయన దృష్టి మ్యూజియంలోని కృష్ణదేవరాయల కాలం నాటి ఖరీదైన ‘వజ్రం’పై పడుతుంది. తన మనుషుల ద్వారా ఆయన ఆ వజ్రాన్ని కాజేసి, ఆ స్థానంలో డూప్లికేట్ వజ్రం పెట్టిస్తాడు. అయితే ఓ స్కూల్ నుంచి విజ్ఞానయాత్రకి వచ్చి మ్యూజియంలో చిక్కుబడిపోయిన కిషోర్ (మాస్టర్ తరుణ్) ఆ దొంగతనాన్ని చూస్తాడు. ఆ దొంగలు ఆ కుర్రాడిని చంపడానికి వెంటపడగా కృష్ణకుమార్ (బాలకృష్ణ ) వచ్చి కాపాడతాడు.

ప్రొఫెసర్ రాందాస్ (టినూ ఆనంద్) ఒక ‘టైమ్ మెషిన్’ తయారుచేస్తాడు. కాలంలో ఒక చోటు నుంచి మరొకచోటుకు ఆ టైమ్ మెషిన్ లో ప్రయాణం చేయవచ్చు. ఆయన కూతురు హేమ (మోహిని)నే కృష్ణకుమార్ ప్రేమిస్తాడు. ఆ ఇద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. కృష్ణకుమార్ ద్వారా హేమకి కూడా కిషోర్ పరిచయమవుతాడు. మ్యూజియంలో కృష్ణదేవరాయల కాలం నాటి వజ్రాన్ని దొంగిలించారని కిషోర్ చెప్పే మాటలను కృష్ణకుమార్ పెద్దగా పట్టించుకోడు. కానీ ఆ పిల్లాడిని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం ఆయన ఆలోచనలో పడతాడు.

ఒకసారి హేమ కోసం వచ్చిన కృష్ణకుమార్ కి టైమ్ మెషిన్ చూపిస్తాడు రాందాస్. అలాగే మరోసారి కిషోర్ కి చూపిస్తాడు. అయితే తన తోటి పిల్లలతో సరదాగా టైమ్ మెషిన్ ఎక్కేసిన కిషోర్ దానిని ఆన్ చేస్తాడు. చివరి నిమిషంలో కృష్ణకుమార్ .. హేమ ఆ పిల్లలను క్రిందికి దింపేస్తారు. ఓ దొంగను తరుముతూ టైమ్ మెషిన్ ఎక్కేసిన ఓ కానిస్టేబుల్ ను మాత్రం వాళ్లు చూసుకోరు. వాళ్లు దిగిపోవాలనుకునేసరికి టైమ్ మెషిన్ ప్రయాణం మొదలవుతుంది. అలా వాళ్లు నేరుగా కృష్ణదేవరాయల కాలానికి చేరుకుంటారు. అక్కడ రాజనర్తకి (స్మిత) ను శత్రువుల బారి నుంచి కృష్ణకుమార్ కాపాడతాడు. ఆమె ద్వారా వాళ్లు రాయలవారిని కలుసుకుని ఆతిథ్యాన్ని పొందుతారు.

రాయలవారి పూజా మందిరంలో ‘వజ్రం’ చూసిన కృష్ణకుమార్, తమ కాలంలో మ్యూజియంలో నుంచి కాజేయబడిన వజ్రం అదేనని గుర్తిస్తాడు. 500 సంవత్సరాల తరువాత ఆ వజ్రం దొంగిలించబడుతుందని ఆస్థాన జ్యోతిష్కులు చెప్పడం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కృష్ణకుమార్ పై మనసుపడిన రాజనర్తకి, ఆయన తిరస్కరించాడనే కారణంతో ద్వేషిస్తుంది. సేనాధిపతితో కలిసి ఓ పథకం వేసి వజ్రాన్ని దొంగిలించడానికి కృష్ణకుమార్ ప్రయత్నించాడని నిరూపించి మరణశిక్ష పడేలా చేస్తుంది.
అయితే శిక్షించిన రాయలవారే రహస్యంగా కృష్ణకుమార్ ను రక్షిస్తాడు. దాంతో అక్కడి నుంచి బయటపడిన కృష్ణకుమార్ .. హేమ .. పోలీస్ కానిస్టేబుల్, టైమ్ మెషిన్ లో తిరుగు ప్రయాణమవుతారు. అయితే తమ కాలంలోకి ప్రవేశించగానే టైమ్ మెషిన్ ను ఎలా ఆపాలో తెలియక, భవిష్యత్తు కాలంలో 2504వ సంవత్సరానికి వెళ్లిపోతారు. అప్పటికి మూడో ప్రపంచ యుద్ధం జరిగేసి మొత్తం రేడియేషన్ ప్రభావం ఉండటం వలన, జనమంతా భూగృహాలలో నివాసం ఉంటూ ఉంటారు.

కృష్ణ దేవరాయలవారి వజ్రంలోని కిరాణాలతో పవర్ సప్లయ్ జరుగుతుండటం చూసి కృష్ణకుమార్ ఆనందాశ్చర్యాలకు లోనవుతాడు. అంతేకాదు అక్కడి టెక్నాలజీ .. సామాజిక పరిస్థితులు .. జీవన విధానం కూడా ఆయనకి చిత్రంగా అనిపిస్తాయి. తమ కాలంలో రాజవర్మ ఏం చేశాడనేది కూడా వాళ్లు అక్కడే తెలుసుకుంటారు. ఆ తరువాత అక్కడి వాళ్ల సహకారంతో తమ కాలానికి చేరుకుంటారు. నిజానికి ఈ కథ చాలా క్లిష్టమైనది .. కథనం అంత కంటే కష్టతరమైనది.
టైమ్ మెషిన్ పై పెద్దగా అవగాహన లేని ఆ రోజుల్లో ఈ కథను ఎంచుకోవడం ఓ పెద్ద ప్రయోగం .. అంతకుమించిన సాహసం. ఎక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా ప్రేక్షకులు అయోమయానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూతకాలంలోకి వెళ్లడం .. అక్కడి నుంచి భవిష్యత్తులోకి వెళ్లడం సాధారణ ప్రేక్షకులను అయోమయానికి గురిచేసే అవకాశాలు ఎక్కువ. కానీ అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సింగీతం ఈ కథను ఒక అందమైన చందమామ కథలా ఎంతో ఆసక్తికరంగా చెప్పారు.
వర్తమాన కాలంలో టైమ్ మెషిన్ తయారీ .. మ్యూజియంలో వజ్రం దొంగతనం అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. రాయలవారి కాలంలో అష్టదిగ్గజాలతో కలిసి ‘భువనవిజయం’లో కథానాయకుడు కూర్చోవడం, తెనాలి రామకృష్ణ చెప్పిన పద్యాలను, ఆయనకంటే ముందుగానే చెప్పడం సరదాగా అనిపిస్తాయి. ఇక భవిష్యత్తు కాలంలో సింగీతం చూపించిన జీవనవిధానం గమ్మత్తుగా అనిపిస్తుంది. భవిష్యత్తు కాలంలోను రాయలవారి వజ్రాన్ని కృష్ణకుమార్ చూడటం .. దానిని తానే మ్యూజియానికి చేర్చినట్టు తెలుసుకోవడం కూడా ఆసక్తికరమైన అంశమే.
ఇళయరాజా సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందనే చెప్పుకోవాలి. ‘జాణవులే’ .. ‘రాసలీల వేళ ‘ పాటలు వింటుంటే తేనె ధారాల్లో తడిసిన అనుభూతి కలుగుతుంది. ‘జాణవులే’ పాట చూస్తుంటే రాయలవారి కాలంలో ‘కౌముదీ జాగరణ’ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. రాజు సుందరం కొరియోగ్రఫీ .. జిక్కీ – బాలు, జానకి – బాలు ఆలపించిన ఈ పాటలు ఆరారగా అమృతాన్ని తాగిస్తాయి. కబీర్ లాల్ – వీఎస్సార్ స్వామి, పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం, ఆర్ట్ డైరెక్టర్ గా పేకేటి రంగా పనితనం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయనే చెప్పుకోవాలి. జంధ్యాల వారి సంభాషణలు సందర్భానికి తగినట్టుగా సహజంగా అనిపిస్తాయి.
టినూ ఆనంద్ – మోహిని పోషించిన తండ్రీ కూతుళ్ల పాత్రలకు బాలు – శైలజ డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. ఇలా కథ .. కథనం .. మాటలు … పాటలు అన్నీ ఈ సినిమాకి సమపాళ్లలో కుదిరిపోయాయి. టైమ్ మెషిన్ ను డిజైన్ చేయించిన తీరు దగ్గర నుంచి అన్నీ ఆకట్టుకుంటాయి. ఒక సైన్స్ ఫిక్షన్ ను అందమైన దృశ్య కావ్యంలా చూపించడం .. మూడు కాలాల్లోను కథను .. పాత్రలను రసవత్తరంగా నడిపించడం సింగీతం ప్రతిభాపాటవాలకు నిలువెత్తు నిదర్శనం. ఈ కారణంగానే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా, ఆయన కెరియర్లోనే ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించింది .. అశేష ప్రేక్షకుల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది.











