దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన హుషారులో రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు తమను అతిగా ఊహించుకుంటున్నారన్న వాదనలున్నాయి. వాపును చూసి బలుపు అనుకున్నట్లుగా ఎక్కడ పోటీకైనా తాము సై అంటున్నారు, అంతేగాక గెలుపు కూడ తమదేనంటున్నారు. తాజాగా , త్వరలో జరగబోయే తిరుపతి పార్లమెంట్ బరిలో జనసేనతో కలిసి దిగుతామని ప్రకటించారు. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం ఆ పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు.
ఒంటరి పోరులో సాధించింది సున్నా
2019 ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడా కూడ బోణీ కొట్ట లేక పోయింది. రెండు మూడు చోట్ల మినహా కనీస పోటీ కూడ ఇవ్వలేక మూడు నాలుగు స్థానాలకే పరిమిత మయ్యారు. వారికి రాష్ట్రంలో మొత్తం వచ్చిన ఓట్లు 1 శాతం కంటే తక్కువే. అప్పుడు తిరుపతిలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బి.శ్రీహరిరావుకు 16,125 ఓట్లు మాత్రమే వచ్చాయి. అవి నోటా ఓట్ల కంటే కూడ తక్కువ కావడం విశేషం.
అంతకు మందు టీడీపీ పొత్తుతో..
ఎన్డీయేగా 2014 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసి రెండు పార్లమెంట్ , నాలుగు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు. భాగస్వామ్యంలో భాగంగా టీడీపీ మంత్రి వర్గంలో ఆ ఎమ్మెల్యేలు పదవులను కూడ అనుభవించారు. ఏపీకి ప్రత్యేక హోదా తదితర విషయాల్లో విభేదించి టీడీపీ , బీజేపీలు ఎవరికి వారు ప్రత్యేకం పోటీ చేశారు. పిట్ట పిట్ట పోరు.. పిల్లి తీర్చినట్లుగా రెండు పార్టీలు ఆ చేదు ఫలితాన్ని చవి చూశాయి.
ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఏపీలో బీజేపీ అంతగా పట్టు సాధించిన ఆనవాళ్లు ఏమి లేవు. అంతేగాక తిరుపతి ప్రాంతంలో ఆ పార్టీకి చెప్పుకోదగిన నాయకులెవరూ లేరు. ఈ నేఫథ్యంలో తిరుపతిలో పొటీ చేసి బీజేపీ సాధించేదేమిటో చూడాలి.
AlsoRead ;- బీజేపీతో నై- ఒంటరిగా సై.. అంటున్న జనసైనికులు