మేఘ ఆకాశ్ .. ‘లై’ సినిమాతో ఈ అమ్మాయి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితిన్ జోడీగా ఈ అమ్మాయి ఈ సినిమాలో బాగానే సందడి చేసింది. చక్కని కనుముక్కుతీరుతో కట్టిపడేసిన ఈ అమ్మాయి, ఆ తరువాత సినిమాను కూడా నితిన్ సరసనే చేసింది. ‘ఛల్ మోహన్ రంగ’ పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో .. హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుందనే పేరు వచ్చిందిగానీ, సినిమా మాత్రం థియేటర్స్ దగ్గర నిలబడలేదు. వరుసగా రెండు ఫ్లాపులు పడటంతో, సహజంగానే అమ్మాయికి అవకాశాలు తగ్గాయి.
ఒక భాషలో అవకాశాలు రాకపోతే ఇతర భాషల్లో ప్రయత్నాలు చేయడం జరుగుతూనే ఉంటుంది. అలా తమిళ .. హిందీ భాషల్లోను ఈ అమ్మాయి గట్టి ప్రయత్నాలే చేసింది. కొన్ని అవకాశాలైతే వచ్చాయిగానీ, అవి అంతంత మాత్రానివే. మరికొన్ని పాత్రలు .. అతిథి పాత్రలు. సినిమా మొత్తం కనిపిస్తేనే గుర్తింపు రావడం కష్టం .. ఇక ఇలా మెరిసి అలా మాయమైపోతే ఎవరు పట్టించుకుంటారు? అలా ఈ అమ్మాయి ఇంతవరకూ సరైన ప్రాజెక్టును పట్టుకోలేకపోయింది. పేరుకు మూడు భాషల్లో చేస్తున్నట్టుగా కనిపిస్తున్నా ఫలితం మాత్రం శూన్యం.
ఇటీవల కాలంలో టాలీవుడ్ కి కుర్రహీరోల తాకిడి ఎక్కువైపోయింది. వాళ్ల జోడీగా కూడా ఎక్కడ మేఘ ఆకాశ్ పేరు వినిపించడం లేదు. తెలుగులో శివకందుకూరి జోడీగా ‘మనుచరిత్ర’ చేస్తున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ సినిమాకి సంబంధించిన అప్ డేట్ మాత్రం తెలియడం లేదు. ఇక ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో తమన్నాతో పాటుగా కనిపించనుంది. కానీ ఈ సినిమాలు ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతాయన్నదే ప్రశ్న. కనుక ఇప్పుడైనా మేఘ ఆకాశ్ తేరుకుని, ఓ నాలుగు క్రేజీ ప్రాజెక్టులు చూసుకోకపోతే కుదురుకోవడం కష్టమే.
Must Read ;- జోడు గుర్రాలపై జోరుమీదున్న బ్యూటీ