రకుల్ ప్రీత్ సింగ్ .. చురుకుదనం .. చలాకీదనం కలిసి పెట్టుకున్న పేరు. చిన్న హీరోలతో .. చిన్న సినిమాలతో తన కెరియర్ ను మొదలుపెట్టిన రకుల్, అదే దూకుడుతో దూసుకెళ్లి పోయింది. స్టార్ హీరోల జోడీగా అవకాశాలను పట్టేయడానికీ, పారితోషికం పెంచేయడానికి ఆమె ఎక్కువ సమయం తీసుకోలేదు. తెలుగు ఇండస్ట్రీకి పరిచమైన కథానాయికలను ఒకసారి పరిశీలిస్తే, ‘సౌందర్య’ తరువాత అంత స్పీడ్ గా స్టార్ స్టేటస్ ను అందుకున్న నాయికగా రకుల్ కనిపిస్తుంది. ప్రతిభతో పాటు కాలం కూడా ఆమెకి కలిసొచ్చింది .. దాంతో ఆమె వెంట సక్సెస్ పరిగెత్తింది.
ఒకానొక దశలో ఆమె ఇండస్ట్రీలోని యంగ్ స్టార్ హీరోల సినిమాలను ఏక కాలంలో చుట్టబెట్టేసింది. ఇతర హీరోయిన్లు ఉడుక్కునేంతగా ఉత్సాహంతో తన కెరియర్ ను ఉరుకులు పెట్టించింది. వరుస సినిమాలు .. వరుస విజయాలతో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. అయితే ఆ స్థానంలో ఆమె ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. ఎంత వేగంగా ఆమె ఆ ప్లేస్ కి చేరుకుందో, అంతే వేగంగా అక్కడి నుంచి జారిపోయింది. ఆ తరువాత ఆమెకి హిట్లు పడకపోవడం ఒక కారణమైతే, ఆమె మూడు పడవల ప్రయాణం మరో కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘సరైనోడు‘ తరువాత రకుల్ కి సరైన హిట్ పడలేదు. ఆ తరువాత ఆమె చేసిన సినిమాలు ఆమె కెరియర్ కి ఎంతమాత్రం హెల్ప్ కాలేదు సరికదా, ఉన్న ప్లేస్ నుంచి కిందకి లాగేశాయి. ఈ నేపథ్యంలోనే ఆమె తమిళ .. హిందీ భాషా చిత్రాలపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా హిందీ సినిమాలపై శ్రద్ధ పెంచింది. దాంతో అటో అడుగు .. ఇటో అడుగు అన్నట్టుగా హడావిడి అయింది. ఎక్కడా కుదురుగా కూర్చునే పరిస్థితి లేదు .. ఫాలోయింగ్ గురించి పట్టించుకునేదీ లేదు.
ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. ఒక్కో భాషల్లో రెండేసి సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. ఒకచోట కాకపోతే మరోచోట బిజీ కావాలనే తొందరపాటుతో పరుగులు పెడుతోంది. ఆ తొందరపాటుకు ఆమె పెట్టుకున్న పేరే ముందుచూపు అని అభిమానులు అంటున్నారు. ఇలా ముందుచూపుతో ఆమె చేసే మూడు పడవల ప్రయాణం ముప్పు తెస్తుందేమోననే అభిప్రాయాలను వాళ్లు వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- నీరెండలో తేనేటిని సేవిస్తోన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్