దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేసేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అందరికి ఉచితంగానే టీకాలు అందిస్తామని ప్రకటించి 24 గంటలు గడవక ముందే మార్గదర్శకాలు విడుదల చేసింది.అయితే ఇవాళ విడుదల చేసిన కొత్త పాలసీ జూన్ 21 నుంచి అమల్లోకి వస్తుంది. కరోనా టీకా మందు వృథాను తగ్గించడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. ఏదైనా రాష్ట్రం టీకాలు వృథా చేస్తే ఆ ప్రభావం తదుపరి కేటాయింపులపై ఉంటుందని కేంద్రం కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్ తయారీదారుల నుంచి కేంద్రం నేరుగా 75 శాతం కొనుగోలు చేయనుంది.ఇలా సేకరించిన వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేస్తారు.
అది వారిష్టం..
జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కూడా టీకాలు అందిస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇంకా 45 సంవత్సరాలు నిండినవారికే టీకాల కార్యక్రమం పూర్తి కాలేదు. దీంతో జూన్ 21 నుంచి 18 దాటిన వారందకీ వేయాలా? లేదా? అని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకే వదిలేసింది. కోవిడ్ వైరస్ తీవ్రత, జనాభా, వ్యాక్సినేషన్లో పురోగతులను పరిగణనలోకి తీసుకుని ఏ రాష్ట్రానికి ఎంత మేరకు వ్యాక్సిన్లు సరఫరా చేయాలనేది కేంద్రం నిర్ణయించనుంది. అయితే ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు సరఫరా చేసేదీ కేంద్రం ముందే ప్రకటిస్తుంది. దీని వల్ల ఆయా రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకునేందుకు వీలవుతుంది. టీకా కేంద్రాల వివరాలు కూడా వెబ్ సైట్లో అందుబాటులో ఉంచాలని తెలిపింది. అయితే 25 శాతం ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేసుకునే వీలు కల్పించింది. టీకా ధరపై రూ.150 మించి సర్వీసు ఛార్జీ వసూలు చేయడానికి వీల్లేదని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కొత్త మార్గదర్శకాలు ఈ నెల 21 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది.
Must Read ;- కరోనా టీకాలనూ కొనని జగన్ సర్కారు.. ధైర్యముంటే ప్రధానిని నిలదీయాలన్న పట్టాభి











