కరోనా కట్టడిలో, కరోనా రోగులకు వైద్యం అందించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగి విఫలమైందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ధ్వజమెత్తారు. కనీసం ఏపీ ప్రభుత్వం కరోనా టీకాలు కొనుగోలు చేసేందుకు కూడా ముందుకు రాకుండా మొద్దునిద్ర పోతోందని ఆయన విమర్శించారు. ఏపీ సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పట్టాభి తప్పుపట్టారు. కరోనా మొదటి వేవ్ సమయంలో పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ వాడాలని చెప్పిన సీఎం, రెండో వేవ్ సమయంలో కనీసం ఆక్సిజన్ కూడా సరఫరా చేయకుండా ప్రతిపక్ష నాయకులపై కక్ష తీర్చుకోవడంపైనే దృష్టి సారించారన్నారు. కేంద్రమే మొత్తం వ్యాక్సిన్ల బాధ్యత తీసుకోవాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాయడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. గ్లోబల్ టెండర్లు పిలిచినా ఎవరూ సరఫరా చేసేందుకు ముందుకు రాలేదని ఏపీ సీఎం అబద్దాలు ఆడుతున్నారని అన్నారు.
అందుకే ఎవరూ ముందుకు రాలేదు..
ఏపీ ప్రభుత్వానికి టీకాలు సరఫరా చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదంటే సీఎం క్రెడిబులిటీ అర్థమైందని పట్టాభి విమర్శించారు. ఏపీకి కరోనా టీకాలు సరఫరా చేసినా బిల్లులు చెల్లించరనే ఏ కంపెనీ ముందుకు రాలేదని ఆయన అన్నారు. జగన్మోహన్‌రెడ్డికి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే విస్వసనీయత లేదని, అందుకే వ్యాక్సిన్ టెండర్లకు ఏ కంపెనీ ముందుకు రాలేదని పట్టాభి విమర్శించారు.ఇందూ టెక్‌జోన్ ఎస్ఈజడ్ వ్యవహారంలో తన అవినీతితో దేశ ప్రధానికే నోటీసులు అందించిన ఘనత జగన్‌కు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఉత్తర కొరియా నియంత కిమ్‌కు ఏపీ సీఎం జగన్‌కు దగ్గరి పోలికలున్నాయన్నారు. ఆంధ్రా కిమ్ జగన్మోహన్‌రెడ్డి అవినీతి, క్విడ్ ప్రోకో, కమీషన్లకు భయపడే వ్యాక్సిన్ గ్లోబల్ టెండర్లలో ఏ కంపెనీ ముందుకు రాలేదని పట్టాభి విరుచుకుపడ్డారు.
అవినీతిలో అంతర్జాతీయ ఖ్యాతి
పీపీఈ కిట్ల కొనుగోలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల వ్యవహారంలో దావోస్ కేంద్రంగా జగన్ అవినీతి ప్రపంచానికి తెలిసిపోయిందని పట్టాభి గుర్తు చేశారు. తన అసమర్థతను,అవినీతిని, తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చు కోవడానికే జగన్ పలు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశాడని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తున్న జగన్, ధైర్యంగా ప్రధానిని ఎందుకు నిలదీయలేక పోతున్నారని పట్టాభి ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడటంపై ఈ ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్లో వ్యాక్సిన్లకు రూ.500 కోట్లు కేటాయిస్తాడా? 18-45ఏళ్ల మధ్య వారికి వ్యాక్సిన్లు వేయాలంటే రూ.1600 కోట్లు ఖర్చవుతాయని ముఖ్యమంత్రికి తెలియదా? అని పట్టాభి నిలదీశారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడానికి రూ.3000 కోట్లు ఖర్చు చేసిన సీఎంకు టీకాలు కొనుగోలు చేయడానికి నిధులు లేవా అని పట్టా+భి ప్రశ్నించారు.
వ్యాక్సిన్ల పంపిణీపై రేపో మాపో సుప్రీంకోర్టు ఒక నిర్ణయానికి రానుందని,వ్యాక్సిన్ల పంపిణీ కేంద్రమే చేపట్టాలని సుప్రీంకోర్టు చెబితే, అప్పుడంతా తన లేఖల వల్లే అని చెప్పుకోవాలన్న చావు తెలివి ఈ ముఖ్యమంత్రిదని పట్టాభి ఎద్దేవా చేశారు.
Must Read ;- గ్లోబల్ టెండర్లు ఉత్తుత్తిదేనా.. ఏపీకి ఎందుకు వ్యాక్సిన్లు దొరకడం లేదు?











