పోలవరం ప్రాజెక్టు పనుల తీరుపై కేంద్ర బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. నెలల తరబడి జాప్యం జరగడం పై అసహనం వ్యక్తం చేసింది. ఇలాగైతే తొలిదశ పూర్తయ్యేదెప్పుడు అని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ప్రశ్నించింది. ఇచ్చిన మాట ప్రకారం పనుల పురోగతి పై జూలై 15నాటికల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కేంద్ర బృందం..దానిని పరిశీలించిన తర్వాత డయాఫ్రం వాల్ మరమ్మతు మెథడాలజీ ఖరారు చేస్తామని స్పష్టం చేసింది.
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్ర బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.మూడు రోజుల పర్యటనలో భాగంగా పోలవరం తోపాటు తూర్పుగోదావరి జిల్లాలోని అనుబంధ పనులను వాటర్ ప్లానింగ్, ప్రాజెక్టు నిర్వహణ కమిటీ సభ్యుడు కె.వోరా నేతృత్వంలోని 14 మంది నిపుణుల బృందం సుదీర్ఘంగా పరిశీలించింది. అనంతరం సంబంధిత అధికారులతో ఈ బృందం సమీక్ష నిర్వహించింది.
ముందుగా హిల్ వ్యూ, స్పీల్ వే లో అమర్చిన గేట్లు, అప్రోచ్ ఛానల్ ను వోరా బృందం సభ్యులు సందర్శించారు.గైడ్ బండ్ , ఎగువ కాఫర్ డ్యాం జల విద్యుత్ కేంద్రం వద్ద జరుగుతున్న పనులను గురించి ఆరా తీశారు. ఈ.సి.ఆర్.ఎఫ్. డ్యాంలో గ్యాప్ 1,2,3 లను, దిగువ కాఫర్ డ్యాం లను సైతం సభ్యులు సందర్శించారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని హెడ్ రెగ్యులేటర్ తో పాటు జంట స్వరంగాలు, శ్యాడిల్ డ్యాం పనులను, ఇతర అనుబంధ పనులను పరిశీలించారు.
కాగా, పోలవరం పనుల తీరు పై కేంద్ర జల సంఘం సభ్యుడు కె.వోరా బృందం అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పనులు జరగకపోవడం పై ఆక్షేపణ తెలిపింది.ప్రాజెక్టు తొలిదశలో భాగంగా 41.15 మీటర్ల కాంటూరు మేరకు నీటిని నిల్వ చేసే పనులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పూర్తిచేస్తామని చెప్పి మాటయిచ్చి ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని రాష్ట్ర జలవనరుల శాఖను కేంద్ర బృందం నిలదీసింది.
కాగా, పనుల ఆలస్యానికి రాష్ట్ర అజలవనరుల శాఖ అధికారులు సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నాలు చేశారు.దిగువ కాఫర్ డ్యాం పను లు చేస్తున్నప్పుడు గ్రౌటింగ్ సమస్యలు తలెత్తాయని.. వీటిని అధిగమించేందుకు సాంకేతికంగా ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరించాల్సి వచ్చినందున 30 రోజులు ఆలస్యమైనట్లు అధికారులు వివరణ ఇచ్చారు. అధికారుల వివరణ పై సంతృప్తి చెందని వోరా బృందం ఆలస్యానికి సాంకేతిక సాకులు చెప్పవద్దని స్పష్టం చేసింది.
ఇలా నెలల తరబడి పనులు ఆలస్య అవుతుంటే.. తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరులో నీటిని నిల్వచేసే పనులు ఎప్పటికి పూర్తవుతాయని ప్రశ్నించింది.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు పనులను ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల 15నాటికి పూర్తిచేసి తమకు నివేదికను అందించాలని ఆదేశించింది. ఆ రిపోర్టును పరిశీలించి వచ్చే నెల 30వ తేదీ నాటికి డయాఫ్రం వాల్ మరమ్మతు.. గ్యాప్-1, గ్యాప్-3 పూడ్చడంపై మెథడాలజీని ఖరారుచేస్తామని వోరా బృందం పేర్కొంది. ఆ మెథడాలజీ ప్రకారం రానున్న ఆగస్టు 15 నుండి సెప్టెంబరు 30 మధ్యన పనులు ప్రారంభిస్తే.. మిగిలిన డిజైన్లన్నింటికి ఆమోదం తెలుపుతామని వోరా బృందం స్పష్టం చేసింది. ఈ డిజైన్ల మేరకు అక్టోబరు 1 నుంచి తుది పనులు సైతం చేపట్టే వీలుంటుందని తెలిపింది.ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ, అనుకున్న సమయానికి పూర్తి చేయాలని వోరా బృందం స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే కేంద్ర బృందం వద్ద రాష్ట్ర జలవనరుల శాఖ నిధుల విడుదల గురించి ప్రస్తావించింది. అయితే ఈ అంశంతో తమకెలాంటి సంబంధమూ లేదని బృందం తెలిపింది. 55,548.87 కోట్ల తుది అంచనా వ్యయం, డయాఫ్రం వాల్ మరమ్మతుకు నిధుల వంటి విషయాలపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. ప్రాజెక్టు పనులు కాలయాపన లేకుండా జరుగుతున్నాయా లేదా.. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇచ్చే వరకే తమ బాధ్యతని తేల్చేసింది.