సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ విషయంలో వైసీపీ అధినేత జగన్‌కు మరోసారి షాక్ తగిలింది. వాటాల బదలాయింపులో జగన్ నిజాలను దాచిపెట్టారని సరస్వతి పవర్ తరపున అధీకృత సంతకందారు, డైరెక్టర్ చాగరి జనార్ధన్ రెడ్డి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ – NCLT హైదరాబాద్ బెంచ్‌కు నివేదించారు. సరస్వతి పవర్‌లో వాటాలను విజయమ్మ, తన పేరుతో కంపెనీ చట్టనిబంధనల ప్రకారం బదలాయించారని, దీన్ని బోర్డు ఆమోదించిందన్నారు జనార్ధన్ రెడ్డి. జగన్ తన చెల్లెలు షర్మిలతో ఉన్న వివాదాల పరిష్కారానికి కార్పొరేట్ లాను అడ్డుపెట్టుకుని ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారన్నారు జనార్ధన్ రెడ్డి.
వాటాదారుల రిజిస్టర్‌లో పేర్లను మార్చాలని, తమ వాటాలను పునరుద్ధరించాలంటూ జగన్, భారతిరెడ్డి పిటిషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. ఇందులో మొదటి ప్రతివాదిగా ఉన్న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ తరఫున అధీకృత సంతకందారుగా, నాలుగో ప్రతివాది హోదాలో డైరెక్టర్‌గా ఉన్న చాగరి జనార్దనరెడ్డి రెండు వేర్వేరు కౌంటర్లు దాఖలు చేశారు.
జగన్ తదితరులు ఆధారాల్లేకుండా, ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించేలా పిటిషన్ దాఖలు చేశారన్నారు జనార్ధన్ రెడ్డి. చట్టప్రకారం ఇది చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. కుటుంబ వివాదాల పరిష్కారానికి జగన్, భారతి.. కంపెనీ చట్టంలోని సెక్షన్ 59ని అడ్డుపెట్టుకుని ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారని పేర్కొన్నారు. ఈ సెక్షన్ కింద వాటాలపై హక్కులను నిర్ణయించలేదని, జగన్ తన పిటిషన్‌లో ఆరోపణలన్నీ విజయమ్మ, షర్మిలపైనే చేశారన్నారు జనార్ధన్ రెడ్డి. ఆ ఆరోపణలతో కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ పిటిషన్ల దాఖలు చట్టప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని వివరించారు జనార్ధన్ రెడ్డి
వాటాల బదలాయింపుపై పిటిషనర్లు ఇచ్చిన నోటీసుపై పూర్తి వివరాలతో గత ఏడాది ఆగస్టులో సమాధానం ఇచ్చామని స్పష్టం చేశారు జనార్ధన్ రెడ్డి వాటాలను తన పేరుతో బదిలీ చేయాలని విజయమ్మ గత ఏడాది జూన్ 14న కంపెనీకి లేఖ రాశారని..దాంతోపాటు జగన్, భారతిరెడ్డి 2021లో ఇచ్చిన గిఫ్ట్‌డీడ్‌లను, క్లాసిక్ రియాల్టీ నుంచి కొనుగోలు చేసిన వాటా విక్రయ ఒప్పందపత్రాల వివరాలను పంపారన్నారు. లేఖ రాగానే పత్రాలను పరిశీలించి నిర్ణయం కోసం బోర్డు సమావేశంలో ఉంచామని..గత ఏడాది జులై 2న బోర్డు సమావేశంలో డైరెక్టర్లు విజయమ్మతో పాటు నా పేరుతో వాటాల బదిలీకి ఆమోదం తెలిపారని స్పష్టం చేశారు. విజయమ్మ నుంచి నోటరీ, బాండ్‌ను తీసుకున్నామన్నారు. వీటి ఆధారంగా సభ్యుల రిజిస్టర్‌లో విజయమ్మతోపాటు తన పేరును చేర్చినట్లు చెప్పారు జనార్ధన్ రెడ్డి. వాటాల బదలాయింపు పారదర్శకంగా జరిగిందన్నారు. విజయమ్మ పేరుతో 1,26,14,168 వాటాలు, తన పేరుతో 62126 వాటాలున్నాయన్నారు జనార్ధన్ రెడ్డి. క్లాసిక్ రియాల్టీ నుంచి 62,126 వాటాలను రూ.16 లక్షల 77 వేల 402కు కొన్నామని తెలిపారు. వాటా కొనుగోలు అందరి ఆమోదంతోనే జరిగిందన్నారు. ఈ వాటాలపై సర్వహక్కులు తనవేనన్నారు. వాస్తవాలను వెల్లడించకుండా దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని కోరారు జనార్ధన్ రెడ్డి. ఇప్పటికే విజయమ్మ సైతం జగన్, భారతీల వైఖరిని తప్పుపట్టిన విషయం తెలిసిందే.











