గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ఇప్పటికే కౌంట్ డౌన్ కూడా మొదలైంది. ఆదివారం సాయంత్రం 6 గంటలతోటే ప్రచారం ముగిసింది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే చేస్తున్నారు. అలాగే ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేస్తున్నారు.
అయితే గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడొచ్చినా దూసుకుపోయే టీడీపీ తెలంగాణలో చతికిలపడిపోయే స్టేజీకి చేరుకుంది. దీంతో తెలంగాణలో పార్టీని బతికించాలంటే గ్రేటర్ ఎన్నికలను ఒక అవకాశంగా మలుచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే టీడీపీ పోటీ చేసేలా పార్టీ నేతలకు బాబు దిశానిర్ధేశం చేశారు. గ్రేటర్ ఎన్నికలకు రేపు పోలింగ్ జరుగుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఓటర్లను ఉద్దేశించి ట్వీట్ చేశారు. తమకు మరో అవకాశమివ్వాలని ఆయన కోరారు.
‘‘హైదరాబాద్ నగరం సర్వతోముఖాభివృద్ధికి పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజాశ్రేయస్సు పట్ల మాకున్న ఆకాంక్ష ఫలితమే సైబరాబాద్. సాప్ట్ వేర్ రంగం ప్రస్థానం మొదలైందే హైటెక్ సిటీ నుంచి. అవుటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, జీనోమ్ వ్యాలీ.. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో చెప్పాల్సి ఉంటుంది. మాటలకన్నా చేతల్లోనే మేం చూపాం.. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి ప్రముఖులను రప్పించి భావితరానికి బాటలు వేయగలిగాం. ఉపాధి కల్పన, సంపద సృష్టి, సంక్షేమం.. ఇవే లక్ష్యంగా ముందుకు సాగాం.. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు మా తెలుగు దేశానివే అని సగర్వంగా చెప్పగలం. ఆ వెలుగులు మళ్లీ రావాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి.. GHMC ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయండి.’’ అంటూ చంద్రబాబు కోరారు.
అధినేత నుంచి సపోర్ట్ కరువు…
గ్రేటర్ ఎన్నికలు ఎప్పడొచ్చినా దూసుకుపోయే టీడీపీ పార్టీ.. ఈ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేదనే చెప్పాలి. చంద్రబాబు సూచన మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 106 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే అభ్యర్థుల ప్రచారానికి బాలకృష్ణ గానీ, లోకేష్ గానీ, చంద్రబాబు నాయుడు గానీ వస్తారనుకున్నారు. కానీ వీరిలో ఎవ్వరూ కూడా ప్రచారంలో పాల్గొనకపోవడంతో టీడీపీ శ్రేణులు అసంతృప్తిలో ఉండిపోయారు. చేసేది లేక ఇక్కడి నేతలతోనే ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధి చేశామని చెప్పుకునే చంద్రబాబు మరీ గ్రేటర్‌లో ప్రచారానికి ఎందుకు రాలేకపోయారనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్త మవుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లి చెప్పుకుంటేనే కదా ఓట్లు రాలేదని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ ఆంధ్ర నేతలు ఎవ్వరైనా ప్రచారంలో పాల్గొంటే ఆంధ్రా పార్టీ అనే ముద్రవేసే ప్రమాదం ఉందని, అందుకే గ్రేటర్ ప్రచారంలో ఎవ్వరూ పాల్గొనలేదని చర్చ కూడా జరుగుతోంది.