జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపుగుర్రాలుగా భావించిన వారికే చాలా పార్టీలు అవకాశం ఇస్తున్నాయి. తాజాగా జరుగుతున్న ఎన్నికలతోపాటు 2016 ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. కాకపోతే గతంలో జరిగిన ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్నవారిలో టీఆర్ఎస్ పార్టీ ముందుండగా ఇప్పుడు బీజేపీ ముందుంది. ఈ మేరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ప్రకటించింది. మొత్తం 150 వార్డుల నుంచి 1122 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 41 డివిజన్లలో నేరచరితులున్నట్లు పేర్కొంది. వీరిలో ఆరుగురు మహిళలుండడం గమనార్హం. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 72 మంది నేరచరితులు బరిలో నిలవగా.. ఈసారి ఆ సంఖ్య 49కి తగ్గడం కొంత మెరుగ్గా భావించవచ్చు.
టీడీపీనుంచి నిల్..
అయితే గతంలో తెలంగాణలో ముఖ్యమైన పార్టీగా ఉన్న టీడీపీ ప్రస్తుతం పార్టీ కేడర్ ని కాపాడుకునేందుకు పోరాడుతోంది. ఈ సారి నేరచరిత ఉన్నవారికి అసలు టిక్కెట్ ఇవ్వకపోవడం గమనార్హం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎంతవరకు పోటీ ఇస్తుందనే విషయం పక్కన బెడితే.. నేరచరిత ఉండి ఏ పార్టీలోనూ అవకాశం దొరక్క.. ఏ పార్టీ అయినా పర్వాలేదు.. గెలవచ్చు అనే వారు చాలామంది ఉంటారు. అయితే మిగతా పార్టీల్లో పోటీ ఎక్కువగా ఉండడంతో నేరచరితులు చాలామంది టీడీపీ గడప తొక్కారు.
ఎలాగైనా సరే.. గెలుస్తాం.. మాకు టిక్కెట్ ఇవ్వండి అని పార్టీ కార్యాలయానికి వచ్చారట. ఎన్నికల షెడ్యూల్ రాకంటే ముందే..ఈ విషయాన్ని కొందరు టీడీపీ నాయకులు వివిధ చోట్ల ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఎన్నికల్లో గెలవడంతోపాటు విలువలు కూడా ఉంటేనే..దీర్ఘ కాలంలో పార్టీకి మనుగడ అనే ఉద్దేశంలో ఆశావహుల విషయంలో ఆచితూచి ఎంపిక చేసింది టీడీపీ పార్టీ. అందరికంటే ముందుగానే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసేసింది.
ఇక ఇతర పార్టీల విషయానికి వస్తే.. ఒక్క కేసు ఉన్నవారు.. బీజేపీనుంచి 11 మంది ఉండగా, టీఆర్ఎస్ నుంచి 6గురు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 9 మంది ఉండగా MIM నుంచి ఐదుగురు ఉన్నారు. రెండు కేసులున్నవారిలో కాంగ్రెస్, MIM నుంచి ఒక్కొక్కరు ఉండగా బీజేపీ నుంచి ఇద్దరు, టీఆర్ ఎస్ నుంచి నలుగురున్నారు. మూడు కేసులున్న వారిలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, టీఆర్ఎస్, బీజేపీనుంచి ఒక్కొక్కరు చొప్పున ఉండగా నాలుగు కేసులున్నవారిలో ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఐదు కేసులున్నవారిలో టీఆర్ఎస్, బీజేపీ నుంచి ఒక్కక్కరు నిలిచారు. ఈ సారి అత్యధికంగా కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ భాజపా అభ్యర్థి ప్రీతమ్‌రెడ్డిపై అత్యధికంగా 9 కేసులున్నాయి.
Must Read ;- ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని నిలదీసిన మహిళా ఓటరు!
ఎంఐఎం ఫస్ట్.. పర్సెంటేజీల్లో
పర్సెంటేజీ ప్రకారం చూస్తే ఎంఐఎం అభ్యర్థుల్లో నేర చరిత ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. ఎంఐఎం ఈ సారి 51 డివిజన్లలో పోటీ చేస్తుండగా 7గురు అభ్యర్థులపై కేసులున్నాయి. 14శాతం టిక్కెట్లు నేరచరితులకు ఇచ్చినట్లు భావించవచ్చు. బీజేపీ 149చోట్ల పోటీకి 17మందిపై కేసులతో 11శాతం, టీఆర్ఎస్ 150మందికి గాను 13మందితో 9శాతం, కాంగ్రెస్ 146కి గాను 12మందితో 8శాతం టిక్కెట్లు కేసులున్నవారికి ఇచ్చినట్లు ఈ లెక్కలను బట్టి తేలుతుంది.
2016లో..
2016 ఎన్నికల్లో 72 మంది నేర చరితులు ఉన్నట్లు అప్పట్లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ జాబితాను విడుదల చేసింది. 51 డివిజన్లలో పోటీ చేస్తున్న 72 మందిపై పోలీసుస్టేషన్లు, కోర్టు విచారణల్లో కేసులున్నాయని ఈ సంస్థ వెల్లడించింది. అందులో టిఆర్ఎస్ పార్టీలోనే ఎక్కువ మంది ఉన్నట్లు అప్పట్లో వెల్లడించింది. టిఆర్ఎస్ 14, టిడిపి 13, కాంగ్రెస్ 13, మజ్లిస్ 11, బిజెపి 4, ఎంబీటీలో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు, బీఎస్పీ ఒకరు, ఎస్పీ ఒకరు, స్వతంత్రుల్లో 11 మంది అభ్యర్థులు నేర చరిత్రను కలిగి ఉన్నారు.
Also Read ;- ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు నన్ను?.. రెచ్చిపోతున్న బండి సంజయ్