తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అంటూ బలంగా చెబుతున్నాయి. అందుకు గల కారణాలను కూడా సూటిగా విశ్లేషించాయి. నిజానికి అవి బీఆర్ఎస్ కు చేటు చేస్తాయని ముందు అందరూ ఊహించినదే. ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన అన్ని సంస్థలు కూడా అదే విషయాన్ని చెప్పడంతో అందరికీ ప్రభుత్వం మారడం ఖాయం అనే అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే తెలంగాణ సీఎంగా ముందుగా వినిపించే పేరు రేవంత్ రెడ్డి. ఎక్కడో జడ్పీటీసీగా తన జీవితం ప్రారంభించిన వ్యక్తి ఎన్నో కేసులు, ఆటుపోట్లు తట్టుకొని ఈ స్థాయికి రావడం మామూలు విషయం కాదు. దీని వెనక రేవంత్ రాజకీయ గురువుగా అందరూ భావించే చంద్రబాబు దిశానిర్దేశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.
2017 దాకా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కొనసాగిన రేవంత్ రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేసి 2017 అక్టోబర్ 31న తెలంగాణ కాంగ్రెస్ లో చేరారు. అంతకుముందు ఆయన తెలుగు దేశం నుంచి బీజేపీలో చేరతారా లేక కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా అనే మీమాంస ఉండేది. కానీ, రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు సలహా మేరకే ఆయన కాంగ్రెస్ లో చేరినట్లుగా టాక్ ఉంది. టీడీపీలో ఉన్నప్పుడే మంచి క్రేజ్ సంపాదించుకున్న రేవంత్ రెడ్డిని బీజేపీలో చేర్చుకుంటే, తెలంగాణలో కాంగ్రెస్ ను పూర్తిగా బలహీనపర్చవచ్చనే కాషాయ పార్టీ ఉద్దేశంగా ఉండేది. అందుకని రేవంత్ పై అధిష్ఠానం ఆసక్తి చూపినప్పటికీ అది ఫలించలేదు.
మొత్తానికి కొద్ది కాలానికే తెలంగాణలో పీసీసీ చీఫ్ అయ్యి పార్టీ ఎదగడానికి ఎంతో పని చేశారు. అంతర్గతంగా పార్టీలో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ అన్ని నెట్టుకొచ్చారు. అయితే, గత ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో ఎంత నష్టం జరిగిందో తెలిసిందే. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పరిస్థితులను అంచనా వేసి.. వ్యూహాత్మకంగా ముందుగానే చంద్రబాబు బరి నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు కూడా కాంగ్రెస్ కి కలిసి వచ్చింది. టీడీపీ బరిలో లేకపోవడంతో ఆంధ్రా ఓటర్లు అందరూ చీలకుండా కాంగ్రెస్ వైపు మళ్లినట్లుగా ఎగ్జిట్ పోల్స్ ని బట్టి అర్థం అవుతోంది. మొత్తానికి చంద్రబాబే రేవంత్ రెడ్డి సీఎం అవ్వడానికి ఓ దారి వేసిన అభిప్రాయం వ్యక్తం అవుతోంది.