తెలంగాణలో డిసెంబరు 3 తర్వాత ప్రభుత్వం మారిపోవడం ఖాయంగానే దాదాపు అన్ని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. అన్ని ప్రముఖ సంస్థలు కాంగ్రెస్ పార్టీ జోరునే చూపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మేజిక్ ఫిగర్ దాటుతుందని ఏ ఒక్క సంస్థకు చెందిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు గానీ లేవు. పైగా రాష్ట్రంలో ఇప్పుడు అధికార పార్టీ వరుసగా రెండు సార్లు పరిపాలించడం కూడా జనాలు మార్పు కోరుకుంటున్నారని ఇంకొన్ని సంస్థలు విశ్లేషించాయి. అసలు కారణం.. బీఆర్ఎస్ పార్టీ ఇటీవల చంద్రబాబు అరెస్టు విషయంలో వ్యవహరించిన తీరు అని అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే బీఆర్ఎస్ అగ్ర నేత కేటీఆర్ చంద్రబాబు అరెస్టుపై ఆ వ్యాఖ్యలు చేశారో ఇక పార్టీ పని అయిపోయినట్లేనని రాజకీయ నిపుణులు విశ్లేషణలు చేశారు. తర్వాత తప్పు తెలుసుకొని నష్టాన్ని ఎంత పూడ్చుకోవాలని యత్నించినా జరగాల్సిన నష్టం జరిగే పోయింది.
దీంతో అటు బలమైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, ఇటు ఎన్నికల ముందు జరిగిన రాజకీయ పరిణామాల అంచనాల నేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వం మారడం తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధిస్తే ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డినే అధిష్ఠానం ఎంపిక చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సీఎం పదవుల కోసం అంతర్గతంగా నేతలు పోటీ పడినప్పటికీ.. ఆయన టీపీసీసీ చీఫ్ అయ్యాకే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చిన సంగతిని అధిష్ఠానం మర్చిపోదు. ఇతరులకు నచ్చజెప్పో, బతిమాలో రేవంత్ నే సీఎం కుర్చీ ఎక్కించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రజల్లో కూడా రేవంత్ కు ఉన్నంత క్రేజ్ కాంగ్రెస్ లో మరే నేతకు అంతగా లేదు.
దీంతో మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా చంద్రబాబు శిష్యుడే అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒకప్పటి చంద్రబాబు శిష్యుడే. తర్వాతి రాజకీయ పరిణామాలతో ఇద్దరూ విభేదించుకొని ఉండవచ్చు. కానీ, టీడీపీ రూట్స్ ఉన్న వ్యక్తి తెలంగాణకు ఈ పదేళ్లు సీఎంగా ఉన్నట్లే లెక్క. ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా మళ్లీ చంద్రబాబు శిష్యుడే సీఎం అవుతారన్నమాట! దీంతో మళ్లీ టీడీపీ డీఎన్ఏనే మళ్లీ తెలంగాణ పీఠం ఎక్కబోతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు.