చంపేసినా పరవాలేదు జై జగన్ అనే మాట నోట పలకను అనిన చంద్రయ్య లాంటి కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలమన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన పార్టీ నేతలని ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పార్టీలో కొందరు నేతలు ఫీల్డులో పని చేయకుండా మాయ చేసే ప్రయతనం చేస్తున్నారని, అటువంటి నేతలకు ఇకపై చెక్ పెట్టనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. పని చేయకుండా.. పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగితే ఉపయోగం లేదన్న ఆయన ఏదో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు కదా అని తాము కొన్నిసార్లు నమ్ముతాము తప్పితే ఎప్పుడూ అదే రకంగా ఆలోచించమని అన్నారు. పార్టీ కోసం ఎవరు పని చేశారు, ఎవరు తప్పించుకుంటున్నారనేది మానిటర్ చేసే వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని, ఇకపై మాయ చేసే నాయకులకు ప్రాధాన్యత ఇవ్వబోమని తేల్చి చెప్పారు.
తెలుగుదేశం పార్టీలో సీనియారిటీని గౌరవిస్తామని, సిన్సియారిటీని గుర్తిస్తామన్న చంద్రబాబు సీనియారిటీ ఉన్నా.. ఓటు వేయించలేని పరిస్థితే ఉంటే ఏం లాభమని ప్రశ్నించారు. ఓట్లు వేయించలేని సీనియర్లు కూడా తమకే ప్రాధాన్యమివ్వాలని కోరితే టీడీపీ ప్రతిపక్షంలోనే ఉండిపోతుందని పేర్కొన్నారు.ఇక 40 శాతం యువతకు సీట్లిద్దామన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నా ఆయన కొందరు సీనియర్ నేతల వారసులు రాజకీయాల్లోకి వచ్చారని, ఇంకొందరు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు. సీనియర్ నేతల వారసులే కాదు.. తటస్థ యువకులనూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, యువత కూడా ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీలో పని చేసే యువ నేతలనూ గుర్తిస్తామన్న ఆయన, వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించడంతో పాటు అవకాశాలిస్తామని స్పష్టం చేశారు.
పార్టీ సభ్యత్వ నమోదు.. పార్టీ సంస్థాగత ఎన్నికలు ఓ పద్దతిగా చేపట్టడం టీడీపీ ఆనవాయితీ అని చంద్రబాబు తెలిపారు.ఒక్క సెకండులోనే 8,700 మంది సభ్యత్వం కోసం అప్రోచ్ అయ్యారన్నారు. కార్యకర్తలే టిడిపికి బాలమన్న చంద్రబాబు, పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు సరైన గౌరవం లభించడం లేదనే బాధ కొందరిలో ఉందని, ఆ బాధను తప్పించేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.ఇక ఎవరికి వారు శక్తిని బట్టి పార్టీకి డొనేషన్లు ఇవ్వాలని, సమాజ హితం కోసం టీడీపీ అవసరం ఉందని, అందుకే డొనేషన్లు కొరుతున్నామని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో ఇచ్చే వాళ్లని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అవసరార్ధం వస్తున్న వారికి ఇవ్వలేకపోతోందన్నారు. పార్టీకి డొనేషన్లు వస్తే.. సీఎం రిలీఫ్ ఫండ్ దక్కని వారిలో కొంత మందికైనా సాయం చేయొచ్చునని చంద్రబాబు చెప్పారు. ఏపీకి గత మూడేళ్లల్లో భారీ డామేజ్ జరిగిందని, రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.