యేరు దాటేదాకా ఓడ మల్లన్న.. యేరు దాటాకా బోడి మల్లన్న.. ఇప్పుడు వైసీపీలో వైఎస్ విజయమ్మ పరిస్థితి ఇలాగే తయారయ్యిందనే చర్చ జోరందుకుంది. ఆపద్కాలంలో వెన్నంటి నడిచిన ఆమె పుట్టినరోజు నాడు కనీసం శుభాకాంక్షలు కూడా తెలపకపోవడమే ఈ చర్చకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.ఇప్పుడు ఇదే అంశంపై వైసీపీలోని క్షేత్ర స్థాయిలోని నేతలు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారట.
వైసీపీ గౌరవాధ్యక్షురాలు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భార్య, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి జన్మనిచ్చిన తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును ఆ పార్టీ శ్రేణులు కనీసం గుర్తు పెట్టుకోలేదు. జగన్ పాదయాత్ర మొదలు పెట్టిన రోజు, పాదయాత్ర ముగించిన రోజు, పార్టీ ఆవిర్భవించిన రోజు ఇలా అన్ని రోజులు గుర్తు పెట్టుకునే వైసీపీ నేతలు అదే పార్టీ గౌరవధ్యక్షురాలి పుట్టిన రోజును మరచిపోవడం పై అనేక విమర్శలు వెల్లువెత్తున్నాయి.
వాస్తవానికి ఏ చిన్న సంధర్భం వచ్చినా వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి గ్రామ స్థాయి కార్యాలయం దాకా భారీ ఫ్లెక్సీలు, కేక్ కటింగ్ లతో ఊదరగొట్టేస్తారు.. అలాంటిది వైసీపీ గౌరవాధ్యక్షురాలి పుట్టిన రోజు నాడు అటువంటి వేడుకలు ఎక్కడా నిర్వహించిన దాఖలాలు లేవు.ఇదంతా ఖర్చుతో కూడిన వ్యవహారమనుకుంటే, కనీసం సామాజిక మాధ్యమాల్లోనైనా విజయలక్ష్మికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు.
సహజంగా ఏ ప్రత్యేకమైన రోజు వచ్చినా ముఖ్యమంత్రి జగన్ ట్విటర్‌లో సందేశాలిస్తూ ఉంటారు.అలాంటిది తనకు జన్మనిచ్చిన తల్లి, ఆపద్కాలంలో తన వెన్నంటి నడిచి, తనకు అధికారం కట్టబెట్టడం కోసం అహర్నిశలు కృషి చేసిన మాతృమూర్తి జన్మదినంనాడు జగన్ కనీసం సందేశమివ్వలేదు. వాస్తవానికి జగన్ తన తల్లికి ఫోన్లోనో, ట్విటర్‌లోనో కాకుండా వ్యక్తిగతంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలపే అవకాశం కూడా లేకపోలేదు..ఎందుకంటే అదేరోజున ఆమె విజయవాడకు సమీపంలోని ఖమ్మం జిల్లాలోనే పర్యటిస్తున్నారు.కావాలనుకుంటే జగన్ తన తాడేపల్లి నివాసం నుంచి హెలికాప్టర్ లో ఖమ్మంలో ఆమె బస చేసిన చోటికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పవచ్చు.కానీ ఆయన ఆ పని కూడా చేయలేదు.అదేరోజున జగన్ విశాఖలో ప్రకృతి చికిత్సను పొందుతున్న హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిసి పరామర్శించి వచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి వస్తే పలకరించడం మారియాదే, కానీ ఖచ్చితంగా కాలవాల్సిన అవసరం లేదు. కావాలంటే ఫోన్ ద్వారా మాట్లాడి కుశల సమాచారం , పరామర్శ చేయవచ్చు.. మరీ అవసరం అనుకుంటే ఆయనకు బదులుగా స్థానిక మంత్రినవ , లేక ఎవరైనా మంత్రిని అక్కడికి పంపి కావలసిన ఏర్పాట్లు చూసుకోమని చెప్పవచ్చు. కానీ జగన్ స్వయంగా వెళ్ళడం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే జగన్ కు, విజయమ్మ, షర్మిల లకు పడడం లేదనే ప్రచారమోకవైపు జరుగుతుండగా, ఇప్పుడు ఆమె పుట్టినరోజు నాడు సొంత కొడుకు గానీ, పార్టీ నేతలు గానీ కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పకపోవడం పై వైసీపీ నేతలే ఇది నిజమే కాబోలు అంటూ చెవులు కోరుక్కుంటున్నారట. ఇదిలా ఉంటే జూలై 8వ తేదీన నిర్వహించే వైసీపీ ప్లీనరీలో గౌరవాధ్యక్ష పదవి నుంచి ఆమె వైదొలగబోతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.