నవ్యాంధ్రలో నెలకొన్న అరాచక పరిస్థితులపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీడీపీ ప్రతినిధి బృందంతో కలిసి సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి భవన్లో రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు వెంట టీడీపీ ఏపీ చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమల రాకృష్ణుడు, ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు రాష్ట్రపతిని కలిసి వారిలో ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చిన చంద్రబాబు.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, రాష్ట్రంలో అసలు జరుగుతున్నదేమిటో తెలుసుకోవాలని, రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధ పాలన సాగాలంటే రాష్ట్రపతి పాలన విధించడం ఒక్కటే మార్గమని కూడా చెప్పారు.
ఆ లింకులన్నీ ఏపీలోనే
రాష్ట్రపతితో భేటీ తర్వాత బయటకు వచ్చిన చంద్రబాబు రాష్ట్రపతి భవన్ పరిసరాల్లోనే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారంటే.. ‘‘తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఇలా ఏ రాష్ట్రంలో గంజాయిని పట్టుకున్నా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి. ఏపీలో 23 వేల ఎకరాల్లో గంజాయి సాగు పెద్ద ఎత్తున జరుగుతోంది. గుజారాత్ లోని ముంద్రా ఎయిర్ పోర్టులో 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడింది. దీనిపై విచారణ జరిపితే చివరకు విజయవాడలోని సత్యనారాయణపురం అడ్రస్ బయటకు వచ్చింది. ఏపీ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్ ఎగుమతి అవుతున్నాయనే విషయం బయటపడింది. రాష్ట్రపతికి అన్ని విషయాలను వివరించాం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా దొరకని మద్యం బ్రాండ్లు ఏపీకి వచ్చాయి. సీఎం జగన్ నాసిరకం మద్యాన్ని తయారు చేయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఒకప్పుడు అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉన్న ఏపీ.. ఇప్పుడు డ్రగ్స్ లో నెంబర్ వన్ గా ఉంది’’ అని చంద్రబాబు మడిపడ్డారు.
రాష్ట్రపతి పాలనే శరణ్యం
రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులు సద్దుమణిగా సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే ఏపీలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ దిశగా చంద్రబాబు ఏమన్నారంటే.. ‘‘టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై జరిగిన దాడులపై సీబీఐతో విచారణ జరిపించి, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరాం. ఏపీ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని చెప్పినందుకే దాడులు చేశారరు. దాడి చేసిన వెంటనే డీజీపీకి ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారు. వైసీపీ ప్రభుత్వం పేట్రేగిపోతోంది. డ్రగ్స్ వల్ల రాష్ట్రంలో యువత నిర్వీర్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఒక ఉన్మాది పాలన ఉంది. రాజ్యాంగ వ్యవస్థలపై కూడా దాడులు చేస్తున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైకోర్టు జడ్జీలతో పాటు ఇతర రంగాలపై దాడులు చేశారు. రాష్ట్ర సహజ సంపదను, వనరులను దోచుకుంటున్నారు. నానాటికీ రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ఏపీలో పరిస్థితులు మరింత ఘోరంగా తయారవకముందే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్రపతిని కోరాం’’అని చంద్రబాబు పేర్కొన్నారు.











