టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాజకీయాల్లోకి వచ్చి అప్పుడే 45 ఏళ్లు దాటిపోతోంది. ఈ 45 ఏళ్ల కెరీర్ లో ఓ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నెన్నో కీలక పదవులను ఆయన అలంకరించారు. ఏ పదవిలో ఉన్నా… తనకంటే జూనియర్లు, ఆయా విషయాలపై అవగాహన లేని వారికి ఆయన ఎంతగానో తోడ్పాటు అందించారు. ఈ విషయంలో ఆయన ఓ టీచర్ గా మారిపోతారు. ఓపిగ్గా విషయాన్ని వివరించడంతో పాటుగా… అప్పటికీ పనికాకపోతే… కాస్త కోప్పడి అయినా ఆ విషయం సదరు నేతలకు అర్థమయ్యేలా చేసేదాకా చంద్రబాబు విశ్రమించరు. అలాంటి ఘటనే బుధవారం నాటి కేబినెట్ భేటీలోనూ చోటుచేసుకుంది. చంద్రబాబు ప్రస్తుత కేబినెట్ లో చాలా మంది మంత్రులు కొత్త వారే. ఈ జాబితాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఒకరు.
కొత్తగా చట్టసభల్లోకి అడుగు పెట్టేవారైనా, కొత్తగా మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నవారైనా… కొన్నాళ్ల పాటు కాస్త ఇబ్బందిపడటం సర్వసాధారణమే కదా. అందుకే కాబోలు… ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరిన తర్వాత పలు కేబినెట్ భేటీలు జరిగినా… అన్నీ గంటల తరబడి కొనసాగాయి. ఒక్కో కేబినెట్ భేటీ ఏకంగా 6 గంటల పాటు సాగిన దాఖలాలు కూడా ఉన్నాయి. కొత్త సర్కారు కొలువుదీరి అప్పుడే 5 నెలలు గడుస్తున్న నేపథ్యంలో కొత్త మంత్రులు కేబినెట్ వ్యవహారాలు నేర్చుకునేందుకు ఆ సమయం సరిపోతుందని చంద్రబాబు భావించినట్లున్నారు.అందుకే.. బుధవారం నాటి కేబినెట్ భేటీలో ఆయన పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇకపై కేబినెట్ భేటీ అంటే కేవలం గంటన్నర, లేదంటే 2 గంటల్లో ముగియాల్సిందేనని ఆయన అన్నారు. ఈ సమయంలో కూడా పాలనా వ్యవహారాల కోసం కొంత సమయం కేటాయించి… మిగిలిన సమయాన్ని పాలిటిక్స్ పై చర్చించేందుకు వినియోగిద్దామని చంద్రబాబు సూచించారు.
ఈ ప్రతిపాదన విన్నంతనే కొత్త మంత్రులంతా నోరెళ్లబెట్టారట. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న చంద్రబాబు… అసలు విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పడం ప్రారంభించారు. “కేబినెట్ భేటీలో ప్రస్తావించే అంశాలతో కూడిన అజెండాను ముందే ఇస్తున్నాం కదా. దానిని ఇంటి వద్ద చదువుకుని, దానిపై పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి రండి. అజెండాలోని అంశాలకు సంబంధించి సలహాలు గానీ, సూచనలు ఉంటే సూచించండి. సంబంధిత శాఖల కార్యదర్శులు వాటిని నోట్ చేసుకుంటారు. ఈ లెక్కన సుదీర్గ అజెండా అయినా కేవలం గంట వ్యవధిలో ముగుస్తుంది కదా. ఆ తర్వాత మరో అరగంట పాటు రాజకీయ అంశాలపై చర్చించుకుని కేబినెట్ భేటీని ముగిద్దాం” అని చంద్రబాబు వారికి వివరించారు. చంద్రబాబు నుంచి వచ్చిన ఈ వివరణ విన్నంతనే మంత్రులంతా ముక్త కంఠంతో సరేనని చెప్పారు. ఈ లెక్కన ఇకపై ఏపీ కేబినెట్ భేటీలు గంటన్నర, లేదంటే రెండు గంటల్లో ముగిసిపోవడం ఖాయమన్న మాట.
వాస్తవానికి కూటమి సర్కారు కొలువుదీరిన తర్వాత ఇప్పటిదాకా జరిగిన కేబినెట్ భేటీల్లో అజెండాను ముందుగా మంత్రులందరికీ పంపిణీ చేసినా…భేటీలో మాత్రం ఆయా అంశాలను సంబంధిత శాఖల కార్యదర్శులు మరోమారు చదివి వినిపించారు. ఈ లెక్కన ప్రతి అంశాన్ని ఇలా కార్యదర్శులు చదవడం, ఆ తర్వాత మంత్రులు తమ మనసులోని అభిప్రాయాలను ఒక్కటొక్కటిగా బయటపెట్టడం జరిగేది. అంటే… కేబినెట్ భేటీలకు మంత్రులు సిద్ధపడి వచ్చేవారు కాదన్న మాట. నాలుగు సార్లు ముఖ్మంత్రిగా, మూడు పర్యాయాలు మంత్రిగా, మూడు పర్యాయాలు ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన చంద్రబాబుకు ఇవన్నీ తెలిసినవే కదా. అందుకే కాబోలు… కూటమి కేబినెట్ లోని కొత్త మంత్రులు కాస్తంత సర్దుకునే వరకు ఓపిక పట్టిన … ఇక ఇచ్చిన సమయం సరిపోతుందిలే అనుకున్నంతనే తనలోని టీచర్ ను నిద్రలేపి… కొత్త మంత్రులకు దిశానిర్దేశం చేశారన్న మాట.