ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయాక అగ్ర నేతల మధ్య ఎప్పటి నుంచో నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు క్రమంగా బయటపడుతున్నాయి. పార్టీలో జగన్ తర్వాత నెంబర్ 2 స్థానం ఎవరనే చర్చ ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే. విజయసాయి రెడ్డి రెడ్డి, సజ్జల రామక్రిష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా ముగ్గురు నలుగురు వ్యక్తులు పార్టీలో టాప్ 2 ప్లేస్ కోసం తహతహలాడుతుంటారు. నేరుగా జగన్ ఎవరినీ ప్రకటించకపోయినప్పటికీ వైసీపీలో తమ మాటే చెల్లుబాటు అయ్యేలా ఆధిపత్యం చెలాయించాలనే కోరిక ఈ నేతల్లో ఉంటుంది. తాజా పరిస్థితుల కారణంగా వీరిలో విజయసాయి రెడ్డి పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉంది.
ఇలాంటి క్రమంలోనే జగన్ కోటరీలోని నేతల్లో విభేదాలు తలెత్తాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దాగి ఉన్న ఈ విభేదాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. నేరుగా ఆ నేతల ద్వారా బయటపడనప్పటికీ, ఆయా నాయకుల అనుచరుల ద్వారా వారి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లం అవుతోంది. పార్టీలో నంబర్ 2.. మా నాయకుడే, ఇంకెవరు? అంటూ కీలక నేతల అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. ఆ నేతలు వారి స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం తమ పోటీదారుల గుట్టుమట్లను బయట పెట్టిస్తున్నారు. వారే స్వయంగా ప్రభుత్వానికి ప్రత్యర్థుల లోటుపాట్లను లీక్ చేస్తున్నారనే వాదన కూడా ఉంది.
ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామక్రిష్ణా రెడ్డి మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా ఉందనే విషయం బయటికి వచ్చింది. చెవిరెడ్డి వైసీపీ రాష్ట్ర సమన్వయకర్తగానే కాక ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్, తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయ నిర్వహణ బాధ్యతలు చూస్తూ వచ్చారు. తర్వాత వచ్చిన సజ్జల రామక్రిష్ణా రెడ్డి తొలుత పార్టీ కార్యాలయ బాధ్యతలు పొందగా.. తన కుమారుడికి పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇప్పించుకున్నారు. ఇలా మూడు పోస్టుల్లో రెండు పోవడం.. చెవిరెడ్డికి రుచించలేదనే అభిప్రాయం ఉంది. రాష్ట్ర పార్టీ సమన్వయకర్తగా నేతలను కలుస్తానంటూ రోజూ వైసీపీ కేంద్ర కార్యాలయానికి రావడం ప్రారంభించారు. దీంతో పార్టీ కార్యాలయ బాధ్యత తీసుకున్న సజ్జల నేత మరోచోట కార్యాలయం పెట్టి, కార్యకలాపాలు సాగించారు. జగన్ వద్ద తన ప్రభావాన్ని మరింత పెంచుకోగలిగారు. ఢిల్లీలో చక్రం తిప్పుతూ జగన్ నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు.. సజ్జల.
చెవిరెడ్డి నుంచి అన్ని బాధ్యతలను లాగేసుకున్న సజ్జల నుంచి చెవిరెడ్డి రాష్ట్ర సమన్వయ బాధ్యతనూ తిరిగి పొందినప్పటికీ.. అది వారం రోజుల ముచ్చటే అయింది. తనకు అడ్డుతగిలిన ఉత్తరాంధ్ర పార్టీ ఇన్‌ఛార్జి అయిన విజయసాయి రెడ్డిని సజ్జల తప్పించగలిగారని టాక్ కూడా ఉంది. ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు నుంచి, నేతల మధ్య పంచాయితీల సర్దుబాటు వరకు అన్నింటిలోనూ తలదూర్చి సజ్జలే జగన్ తలలో నాలుక అయ్యారు. ఇప్పుడు పార్టీ ఘోర పరాజయానికీ సజ్జల తప్పిదాలే ప్రధాన కారణమని అన్ని వేళ్లూ ఆయనవైపే చూపించేలా చెవిరెడ్డి చేయగలిగారు. దీంతో సజ్జలకు ఒళ్లు మండి చెవిరెడ్డి వ్యక్తిగత రహస్యాలను బయటపెట్టించారనే చర్చ వైసీపీ వర్గాల్లో ఉంటోంది.











