ఉత్తరాంధ్రలో మరో యువ నేత రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. నాలుగు దశాబ్దాల నుండి రాజకీయాల్లో ఉన్న కుటుంబ నేపథ్యం. దశాబ్ధ కాలంగా పార్టీ కోసం అలుపెరగని కృషి చేస్తున్న యువ నేత చింతకాయల విజయ్.. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అంటున్నారు. అనకాపల్లి ఎంపీ టీడీపీ అభ్యర్ధిగా బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారు విజయ్ పాత్రుడు. పార్టీలో పలువురు పోటీ పడుతున్నా, అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ ఓటు విజయ్ పాత్రుడికే అని పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఆయన అభ్యర్ధిత్వం దాదాపు ఖాయం అయిందని సమాచారం.
టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడే చింతకాయల విజయ్. అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ నుంచి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసిన విజయ్, ఆ సమయంలోనే ప్రజాసేవకు అంకితం కావాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఎన్నికల బరిలోకి దిగకుండా.. ముందుగా రాజకీయాలపై అవగాహన పెంచుకొని, క్షేత్ర స్థాయిలో ప్రజల కష్టాలపై అధ్యయనం చేసిన తర్వాతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. మాజీ ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్‌లో శిక్షణ తీసుకున్నారు. అక్కడే ఆయన పార్టీ పోలిటిక్స్‌పై పట్టు పెంచుకున్నారు. నరేంద్ర మోడీ, ఎల్ కే అద్వానీ, శశి ధరూర్ వంటి జాతీయ నాయకుల ప్రసంగాల ద్వారా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నారు. ఆ విజ్ఞానమే ఇప్పుడు చింతకాయల విజయ్‌ని ప్రగతిశీల నాయకుడిగా నిలిపింది. పూణేలోని స్కూల్ ఆఫ్ గవర్నెన్స్‌ని దలైలామా సందర్శించిన సమయంలో లక్ష మంది సభికుల ముందు విజయ్ చేసిన ప్రసంగం.. ఆయన రాజకీయ భవిష్యత్తుకు సోపానంగా నిలిచింది.
రాజకీయంగా తండ్రికి అండగా ఉంటూ.. దశాబ్ద కాలం క్రితమే నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై గళమెత్తారు చింతకాయల విజయ్. తమ ప్రాంతంలో కాలుష్య కారక పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడిన యువ పాత్రుడు.. 2012లో నర్సీపట్నం నుండి వైజాగ్ వరకు పాదయాత్ర చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి విజయ్ చేస్తున్న ఉద్యమంతో స్పందించిన అనేక మంది ప్రజలు ఆయన పాదయాత్రలో భాగస్వాములయ్యారు. దీంతో దిగొచ్చిన అప్పటి ప్రభుత్వం పారిశ్రామిక కాలుష్య నివారణకు చర్యలు తీసుకొంది. యువ నేతగా చింతకాయల విజయ్ సాధించిన మొదటి విజయమిది.
ప్రకృతి వ్యవసాయం, రెన్యువబుల్ ఎనర్జీ రంగాను అభివృద్ధి చేయడం చింతకాయల విజయ్ చిరకాల ఆశయం. ఆర్గానిక్ ఫార్మింగ్ దిశగా రైతులను పోత్సహిస్తూ.. ప్రజలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడానికి తన వంతు కృషి చేస్తున్నారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా, తన ఆశయ సాధన కోసం, ఉత్తరాంధ్రలో మొట్టమొదటి సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించిన యువ పారిశ్రమకవేత్తగా నిలిచారాయన. అక్కడితో ఆగకుండా… అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ను నిర్వహించిన యంగ్ లీడర్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్‌లో పాల్గొని.. ఉత్తరాంధ్రలో గ్రీన్ ఎనర్జీ డెవలప్‌మెంట్‌కి పెట్టుబడుల సమీకరణకు కృషి చేశారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీలో చదువుకున్న అనుభవం ఇక్కడ ఉపయోగపడింది.
2014లో తెలుగుదేశం పార్టీ గెలిచి, తండ్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మంత్రి అయినా.. విజయ్ ఎలాంటి పదవులు ఆశించలేదు. పదేళ్లకు పైగా పార్టీ కోసం శ్రమిస్తూ.. వారసత్వంగా కాకుండా ప్రతిభ ఆధారంగా పార్టీలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఐటిడిపి విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో యాక్టివ్‌గా ఉన్న విజయ్‌ని టార్గెట్ చేసింది తాడేపల్లి ప్యాలెస్. టీడీపీ సీషల్ మీడియా టీమ్‌ని యాక్టివ్ చేశారు. జగన్ సర్కార్‌పై పోరాడుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటూ వారికి ధైర్యాన్ని, బలాన్ని ఇస్తున్నారు విజయ్. టీడీపీ బలోపేతానికి విజయ్ చేస్తున్న కార్యక్రమాలను అడ్డుకోవడానికి జగన్ సర్కార్ ఆయనపై 18 కేసులు మోపిందంటే.. ఆయన ఎంత ప్రభావవంతంగా పనిచేశారో అర్ధం చేసుకోవచ్చు. మహిళలపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అకృత్యాలను వెలుగులోకి తీసుకువచ్చిన వీడియోని విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ నెలల తరబడి ఆయనని వేధింపులకి గురి చేసింది జగన్ టీమ్.. వైసీపీ వేధింపులను సైతం తట్టుకొని పార్టీ కేడర్‌లో జోష్ నింపారు. పోరాడిదే పోయేదేమీ లేదని అధికారం దక్కడం మినహా అని తమ్ముళ్లలో పోరాట స్ఫూర్తి రగిలించారు.
పని చేసే వారిని పదవులు వెతుక్కుంటూ వస్తాయి. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ సీటు చింతకాయల విజయ్‌కే ఇస్తారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అనకాపల్లి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన 11 లోక్‌సభ ఎన్నికల్లో 8 సార్లు స్థానికేతరులే గెలిచారు. అనకాపల్లి ఎంపీలుగా గతంలో విజయం సాధించిన సబ్బం హరి, అవంతీ శ్రీనివాస్, గంటా శ్రీనివాస్ నాన్ లోకల్ లీడర్లు. ఒకసారి గెలిచిన తర్వాత మరోసారి ఇక్కడి నుండి పోటీ చేయలేదు. మరో నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు. సైకిల్ ఎక్కి విజయం సాధించిన కొందరు ఆ తరవాత వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అందుకే ఈసారి స్థానికుడైన చింతకాయల విజయ్‌కే అనకాపల్లి లోక్‌సభ టీడీపీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లపై విజయ్ పాత్రుడికి మంచి పట్టుంది. అణువణునా ఆయనకు కరతలామలకం. రాజకీయ వారసత్వం మరో అడ్వాంటేజ్. తండ్రి సొంత నియోజకవర్గం నర్సీపట్నం కూడా ఇదే పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉండడం విజయ్ పాత్రుడికి మరో ప్లస్ పాయింట్.. అందుకే, విజయ్ పాత్రుడు అనకాపల్లి ఎంపీగా బరిలో దిగితే, ఆయన గెలుపు నల్లేరుపై నడకే అని చెబుతున్నారు. విజయ్ అడుగుపెడితే గెలుపుపై కాదు, మెజారిటీపై లెక్కలు వేసుకోవాల్సిందే అని తెలుగు తమ్ముళ్లు ధీమాగా ఉన్నారు.. మరి, విజయ్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి..