హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ నగరం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో దీనిపై చర్చించానని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఎన్నో ప్రయోజనాలు..
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తే దేశంలో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయని జస్టిస్ ఎన్వీ రమణ గుర్తు చేశారు. వ్యాపార లావాదేవీల్లో వివాదాల పరిష్కారానికి ఏళ్ల తరబడి పడుతోందని, అందుకే చాలా మంది మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఏవైనా వివాదాలు వచ్చినప్పుడు సింగపూర్‌లోని ఆర్బిట్రేషన్ కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకుంటే మన దేశంతో పాటు పొరుగు దేశాలకు చెందిన వ్యాపారుల కేసులు కూడా వస్తాయన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు విషయంలో సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడా సంప్రదించినట్టు ఆయన తెలిపారు. తన పదవీ కాలం ముగిసేలోగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని జస్టిస్ రమణ మీడియాకు వెల్లడించారు.
Must Read ;- లక్ష్మీ నరసింహస్వామి సేవలో సీజేఐ ఎన్వీ రమణ దంపతులు











