తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, వెంటనే భద్రత కల్పించాలంటూ వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి కడప ఎస్పీని కోరారు. వివేకానందరెడ్డి హత్య కేసులో 8 రోజులుగా సీబీఐ వేగంగా విచారణ సాగిస్తోంది. ఈ నేపథ్యంతో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు. వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో విచారణ సాగుతున్న కొద్దీ అనేక మంది కొత్తవారి పేర్లు బయటకు వస్తున్నాయని తెలుస్తోంది. కేసు విచారణ కూడా తుది దశకు చేరుకుంటూ ఉండటంతో సునీతపై ప్రత్యర్థులు ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది.
పులివెందులలో భద్రత పెంచండి
పులివెందులలో తన నివాసం వద్ద భద్రత పెంచాలని సునీతారెడ్డి కడప జిల్లా ఎస్పీ అన్భురాజన్‌ను కోరారు. గతంలో అనేకసార్లు కడప ఎస్పీని కలసినా ఎప్పుడు కూడా తనకు భద్రత కల్పించాలని సునీత కోరలేదు. రెండు రోజుల కిందట వివేకానందరెడ్డి హత్య జరిగిన ఇంటిని మరోసారి పరిశీలించిన సీబీఐ అధికారులు సునీతను కూడా విచారించారు.ఈ క్రమంలో తనకు రక్షణ కల్పించాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడైనా తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.
హత్యకు ముందు తిరిగిన వాహనాల ఆధారంగా..
వివేకానందరెడ్డి హత్యకు ముందు ఆ ప్రాంతంలో తిరిగిన వాహనాల సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా సీబీఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. హత్యకు కొన్ని గంటల ముందు ఇన్నోవా వాహనంలో కొందరు అనుమానితులు వచ్చినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. AP-04-1189 నెంబరు వాహన యజమాని అరకటవేముల రవి, డ్రైవర్ గోవర్థన్‌లను ఇప్పటికే సీబీఐ అధికారులు విచారించారు. రిజిస్ట్రేషన్ నెంబరు లేని వాహనాలు కూడా హత్యకు ముందు ఆ ప్రాంతంలో తిరిగినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. ఆ వాహనాల వివారాలు సేకరించేందుకు రవాణా శాఖ అధికారులను కూడా సీబీఐ అధికారులు పిలిపించి విచారించారు.
Must Read ;- అనుకూల నివేదిక కోసం వైద్యులపై ఒత్తిడి.. తన వద్ద సాక్ష్యాలున్నాయన్న ఆర్కే











