భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లితో పాటు తెలంగాణ కేబినెట్‌లోని పలువురు మంత్రులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్,మున్సిపల్ అండ్ ఐటీ మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని, సబిత, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, మాజీ మంత్రులు సహా పలువురు స్వాగతం పలికారు. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు కూడా ఎయిర్ పోర్టుకు వెళ్లారు. భారీ బందోబస్తు మధ్య సీజేఐ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై ,అప్పటికే అక్కడికి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీజేఐ ఎన్వీ రమణకు ఘన స్వాగతం పలికారు. స్వాగత కార్యక్రమం ముగిశాక సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ తదితరులు కాసేపు ముచ్చటించుకున్నారు.
శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతోనే..
కాగా శుక్రవారం ఉదయం జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుచానూరు అమ్మవారి దర్శనం అనంతరం అలిపిరి మార్గం నుంచి తిరుమల చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు వెంట ఉన్నారు. అక్కడ సీజేఐ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని, న్యాయవ్యవస్థ కీర్తి పెంచేందుకు పాటుపడతానని వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరారు.
Must Read ;- సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడిన రూల్.. జాబితా నుంచి YC మోదీ అవుట్
అప్యాయంగా పలకరించిన సీజేఐ..
శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గొనుగొంట్ల కోటేశ్వరరావుతో ఆప్యాయంగా మాట్లాడారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కలిసేందుకు కోటేశ్వరరావు రాగా సీజేఐ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఎయిర్‌పోర్ట్ నుండి రాజ్‌భవన్ వెళ్లారు. మూడు రోజుల పాటు రాజ్‌భవన్ అతిథి గృహంలో ఆయన ఉండనున్నారు.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 42కు పెంపు
కాగా తెలంగాణ ఏర్పాటైన తరవాత తెలంగాణ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులు కేటాయించాలని, న్యాయమూర్తుల సంఖ్య 42కి పెంచాలని, తద్వారా పెండింగ్ కేసుల పరిష్కారం వేగిరం అవుతుందని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం చానాళ్లుగా కేంద్ర న్యాయశాఖకు, సర్వోన్నత న్యాయస్థానానికి కూడా విన్నవిస్తూ వస్తోంది. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచితే అందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు లేఖలు రాసింది. అయితే న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారం వేగవంతం చేయాలనే లక్ష్యంతో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాక హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కు పెంచేందుకు ఇటీవలే ఆమోదం తెలిపారు. ఈ పెంపుదల సోమవారం నుండే అధికారికంగా అమల్లోకి రానుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే, సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది.
Also Read ;- సీజేఐ ఎన్వీ రమణ కీలక నిర్ణయం : తెలంగాణ హైకోర్టు జడ్జీల సంఖ్య 42కు పెంపు!