అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అలాంటి మహోన్నత త్యాగమూర్తిని స్మరించుకొంటూ.. రాజధాని అమరావతిలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షతో ప్రాణ్యత్యాగం చేసినందుకు గుర్తుగా 58 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. త్యాగమూర్తి విగ్రహానికి స్టాచ్యు ఆఫ్ శాక్రిఫైస్ అని పేరు పెట్టారు. 6.8 ఎకరాల్లో మెమోరియల్ పార్క్ అభివృద్ధి చేస్తున్నారు. ఈ పార్కుకు పొట్టి శ్రీరాములు స్మృతి వనంగా పేరు పెట్టారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో.. సీఎం చంద్రబాబు ఈ విషయాలను వెల్లడించారు.
వేలాది రైతుల త్యాగాలతో అమరావతిలో రాజధాని నిర్మాణం జరుగుతోంది. అటువంటి త్యాగాల గడ్డపై.. త్యాగధనుడు పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయడం విశేషమే. తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన పొట్టి శ్రీరాములుకు మొదట గుర్తింపు ఇచ్చింది తెలుగు దేశం పార్టీయేనని తెలిపారు సీఎం చంద్రబాబు. 1985లో అప్పటి ముఖ్యమంత్ర ఎన్టీఆర్.. తెలుగు విశ్వ విద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన జన్మించిన నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు అనే పేరు పెట్టాలని 2003లో ఉమ్మడి రాష్ట్రం సీఎంగా ఉన్న చంద్రబాబు కేంద్రానికి ప్రతిపాదన పంపారు. 2008లో కేంద్ర ప్రభుత్వం జిల్లా పేరును పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చి నోటిఫై చేసింది.
ఈ సందర్భంగా ఆర్య వైశ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. గుప్తా, వైశ్య, శెట్టి, కోమటి వంటి వారికి వేర్వేరుగా కాకుండా.. అందరినీ కలిపి ఆర్యవైశ్యులుగా గుర్తించి.. ఒకే కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఆర్యవైశ్యుల కులదైవం కన్యకా పరమేశ్వరీ అమ్మవారు జన్మించిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరును వాసవీ పెనుగొండగా మార్చారు. ఇక్కడ బ్రహ్మాండమైన దేవాలయాన్ని కట్టించి.. పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చుతామన్నారు











