దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టీమ్ కొత్త ట్రెండ్ సృష్టించింది. వేలు, లక్షల కోట్ల ఒప్పందాలు అంటూ హడావుడి కాకుండా..ఈ సారి కేవలం ఏపీ బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకే ప్రాధాన్యత ఇచ్చింది. ఏపీకి భారీగా పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రత్యేకమైన నెట్‌వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా నాలుగు రోజుల పర్యటన సాగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అనుకూల పరిస్థితుల గురించి ప్రజంటేషన్ ఇచ్చింది. రాష్ట్రానికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని పారిశ్రామికవేత్తలను కోరింది చంద్రబాబు టీం. మొత్తంగా నాలుగు రోజుల పర్యటనలో మార్కెటింగ్ మీదనే ఫోకస్ పెట్టింది చంద్రబాబు టీం.
దావోస్‌లో నాలుగు రోజుల పాటు పర్యటించిన చంద్రబాబు బిల్‌గేట్స్ సహా వివిధ రంగాలకు చెందిన 15 అత్యున్నత వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, ముఖాముఖి మీటింగ్స్ ఇలా విరామం లేకుండా గడిపారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, అందుకు అనువైన పరిస్థితులను స్వయంగా పారిశ్రామికవేత్తలకు వివరించారు.
దావోస్‌లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు పేరు మోసిన పారిశ్రామికవేత్తలు వస్తారు. పెట్టుబడులు ఆకర్షించాలనుకునేవారికి ఇది సరైన వేదిక. ఆయా దేశాలు, రాష్ట్రాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఇక్కడ ప్రజెంట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అప్పటికప్పుడు అగ్రిమెంట్ చేసుకోవడం ఏది ఉండదు. ఒకవేళ ముందస్తుగా చేసుకున్న ఒప్పందాలు ఉంటే ఈ సదస్సులో పేపర్లు మార్చుకుంటారు. ఇక్కడ చేసుకున్న అగ్రిమెంట్స్‌లో గ్రౌండ్ అయ్యేవి చాలా తక్కువ. అందుకే చంద్రబాబు, లోకేష్ టీం ఈ సారి అలాంటి పెట్టుబడులకు దూరంగా ఉంది. కేవలం ఏపీ బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చింది.
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న పెద్దపెద్ద కంపెనీల సీఈవోలు దావోస్ వచ్చారు. చంద్రబాబు టీంతో తమ ప్రతిపాదనలపై చర్చించారు. పెట్టుబడులకు సంబంధించిన ప్రకటనలకు దావోస్ సరైన వేదిక కాదని, ఏ ప్రకటన చేసినా అది ఏపీ వేదికగానే ఉండాలని చంద్రబాబు టీం భావిస్తోంది. ఇందులో భాగంగానే పారిశ్రామిక వేత్తలను ఏపీకి ఆహ్వానించి, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన తర్వాతే ప్రకటనలు చేయాలని కోరింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్లీ ఏపీలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు సిద్ధమైంది. ఇందుకు అనువైన, స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించింది. జగన్ రెడ్డి హయాంలో పారిశ్రామిక వేత్తలను వేధించారు. వసూళ్ల పేరుతో బెదిరింపులకు దిగారు. ఏపీని దక్షిణాది బిహార్ అనేంతలా చెడ్డపేరు తీసుకువచ్చింది వైసీపీ. కానీ గడిచిన ఏడు నెలల్లో చంద్రబాబు టీం కృషితో ఏపీకి మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయి.










