ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్ కేసులో పీకల్లోతుల్లో ఇరుక్కుపోయిన ఐపీఎస్ సునీల్ కుమార్.. మరోసారి రెచ్చగొట్టే చర్యలు చేపడుతున్నారనే వాదన మొదలయింది.. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం చంద్రబాబు సర్కార్‌లో అసహనం పెంచేలా ఉందనే చర్చ జరుగుతోంది.. ఎస్‌సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఏర్పాటు చేసింది.. దీంతో, మాలల సంఘాలు ప్రభుత్వ తీరుని నిరసిస్తూ ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది.. ఈ కార్యక్రమానికి ఐపీఎస్ సునీల్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరవడం .. ప్రభుత్వ వర్గాలలో చర్చనీయాంశం అయింది..
ఈ సమావేశంలో మాలలకు నష్టం చేకూర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఎలాంటి కార్యాచరణ అనుసరించాలో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.. ఎస్‌సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తే, దానిని వ్యతిరేకించడం, రాష్ట్ర సర్కార్‌ని స్తంభింపజేయాలని తీర్మానించారు.. ఇటు, మాల ప్రజా ప్రతినిధుల నివాసాలను ముట్టడించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు.. అసెంబ్లీని ముట్టడించాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాలని నిర్ణయించారు మాల సంఘాల ప్రతినిధులు.. అయితే, సునీల్ నిర్ణయం వెనక వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉన్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఎస్‌సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వైసీపీ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది.. అందుకే, మాదిగలతోపాటు ఇతర ఎస్‌సీ వర్గాలకు వ్యతిరేకంగా మాలల పోరాటానికి సునీల్ కుమార్ ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చారని, త్వరలో ఇది మరింత ఉద్ధృతం అవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి..
అయితే, ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఐపీఎస్ సునీల్ కుమార్.. ప్రభుత్వ వ్యతిరేక సమావేశాలలో పాలుపంచుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కొందరు అధికారులు.. ఆయన తీరు ఏమాత్రం సమంజసంగా లేదని, ఇది ప్రభుత్వాన్ని ధిక్కరించడమే అని ఆరోపిస్తున్నారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..
వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో సునీల్ కుమార్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించారు.. జగన్ ఇచ్చిన అధికారాలతో విచ్చలవిడిగా రెచ్చిపోయారనే ఆరోపణలు ఉన్నాయి.. ముఖ్యంగా తనని జైలులో తీవ్రంగా చితకబాదడం వెనక ప్లాన్ అంతా సునీల్ కుమార్‌దే అని ట్రిపుల్ ఆర్ ఆరోపిస్తున్నారు.. ఈ ఘటనపై ఇప్పటికే కూటమి సర్కార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.. ఇటు, సునీల్ కుమార్‌ని సస్పెండ్ చేసింది.. అంతేకాదు, ఆయన ఓ మతానికి అనుకూలంగా ప్రచార వేదికలలో పాల్గొన్నాడు.. ఇవన్నీ ఆయనపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి..
తాజాగా, సునీల్ కుమార్ ఎస్‌సీ వర్గీకరణపై ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాలు పంచుకోవడం వివాదాస్పదం అవుతోంది.. దీనిపై కూటమి సర్కార్ ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి..