అప్పుడెప్పుడో వచ్చిన ఓ పాత తెలుగు సినిమాలో వాడిన ఓ పదం అప్పట్లో బాగా పాపులరైంది. అదే ‘జ్ఞాన బుడిప’. అందులో సుత్తి వీరభద్రరావుని ఆయన భార్య రోజూ అప్పడాల కర్రతో నెత్తిపై కొడుతుంటుంది. ఆ దెబ్బలకు అతడి నెత్తిపై ఓ బుడిప వస్తుంది. ఓ సందర్భంలో ఆయన ఆఫీసు వాళ్లు అది చూసి ఏంటని అడిగితే.. భార్య కొట్టిందని చెప్పుకోవడానికి సిగ్గుపడిన సుత్తి.. ‘తనకు జ్ఞానం ఎక్కువై బుడిప రూపంలో బయటకు వచ్చిందని, ఇది జ్ఞాన బుడిప’ అని చెప్పుకుంటాడు. సరిగ్గా ఇదే తరహాలో మన ఏపీ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ప్రతిరోజూ కోర్టులు వేస్తున్న మొట్టికాయలకు ప్రభుత్వం నెత్తిపై బుడిప తయారైంది. ఎవరైనా ఏంటిదని అడిగితే.. మా పని తీరుకు ప్రజలిచ్చిన రివార్డులు అని చెప్పుకుంటున్నారు. కోర్టులు చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటున్నాయని సాక్షాత్తూ సీఎం జగనే మాట్లాడుతున్నారు. నెత్తిమీది బొప్పిని మాత్రం కప్పిపుచ్చుకుంటున్నారు.
తీరు మారదా!
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బహుశా ఏ ముఖ్యమంత్రికీ కోర్టు ఇన్నిసార్లు చీవాట్లు పెట్టుండదు. ఇన్ని మొట్టికాయలు వేసుండదు. అవినీతి కేసుల్లో కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగిన ఆయనకు.. కోర్టులపై ద్వేషం ఏర్పడిందా? లేకపోతే.. తను షీఎం.. తనను ఎవరూ తప్పుబట్టడానికి, ఆదేశించడానికి వీళ్లేదు అనే భావనలో ఉన్నారా? ఒక్కసారి కోర్టు ఏ విషయంలోనైనా ప్రభుత్వాన్ని తప్పుబడితే.. ఏ సీఎం అయినా తన తీరు మార్చుకుంటాడు. కానీ, మన షీఎం మాత్రం చేసిన తప్పుని సరిదిద్దుకోకుండా.. తప్పుమీద తప్పు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. అదేమంటే.. కోర్టులన్నీ చంద్రబాబు మాట విని తనపై పగబట్టేశాయని అంటుంటారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కాబోయే చీఫ్ జస్టిస్ పైనే ఆరోపణలకు తెగబడ్డారు. అవినీతి మరకలు అంటించేందుకు యత్నించారు.
రంగుల పార్టీ..
ముందుగా పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేసిన అంశంపై హైకోర్టు మండిపడింది. ప్రభుత్వ ఖర్చుతో పార్టీరంగులు ఎలా వేస్తారంటూ.. జగన్ ప్రభుత్వాన్ని తిట్టిపోసింది. వెంటనే పార్టీ ఖర్చుతో ఆ రంగులు మార్చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, మన జగమొండి జగన్.. దీన్ని అసలు పట్టించుకోలేదు. పైగా కోర్టును తప్పుదారి పట్టించారు. కోర్టు మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొంచెం దిగొచ్చి రంగులకు కొద్దిపాటి మార్పులు చేశారు. అలా ఈ ఒక్క అంశంలోనే కోర్టు మన షీఎం గారికి ఓ పది పన్నెండు సార్లు మొట్టికాయలు వేసింది. ఆ తర్వాతా ఇదే తంతు.
పంచాయితీ ఎన్నికలతో తారాస్ఘాయి..
పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంలో, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించిన అంశంలో, బాబాయ్ హత్య కేసు విషయంలో, వివిధ ప్రభుత్వ పథకాల అమలు విషయంలో, డాక్టర్ సుధాకర్ అంశంలో.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నో.. ఎన్నెన్నో.. కేసుల్లో కోర్టలు మొట్టికాయలు వేస్తూనే ఉంది. మన షీఎం గారికి తన బొప్పి కడుతూనే ఉంది. కానీ, ఆయన తీరులో మాత్రం మార్పురావడంలేదు. రాష్ట్ర కోర్టుల్లోనే కాదు సుప్రీంకోర్టులో కూడా ఆయనకు ఎదురు దెబ్బలు తప్పడంలేదు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ప్రభుత్వానికి ఏర్పడ్డ జ్ఞాన బుడిపి పగిలే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.