ఏపీ సీఎం జగన్ తన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి కార్యక్రమానికి దూరంగా ఉండడంపై పార్టీలో చర్చ నడుస్తోంది. వైస్ వివేకా వర్థంతి సందర్భంగా పులివెందులలో వివేకాఘాట్ వద్ద వైఎస్ వివేకా కుమార్తె సునీత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, జగన్ చెల్లెలు షర్మిల, వైఎస్ భార్య వైఎస్ విజయమ్మతో పాటు కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. పలు అనుమానాలు నెలకొన్న వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తున్న నేపథ్యంతో పాటు తెలంగాణలో షర్మిల పార్టీ పెడుతున్న నేపథ్యంలో జగన్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది.
తన ఇంట్లోనే వివేకానంద హత్య
2019మార్చి 15న పులివెందులలోని తన ఇంట్లోనే వివేకానంద హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటుతో చనిపోయాడని చెప్పినా..తరువాత అది హత్యగా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వివేకాకు గాయాలు ఉండడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీపై వైసీపీతో పాటు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కూడా పలు ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. తరువాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యారు. అయితే వివేకా హత్యకేసు విషయంలో సీబీఐ విచారణకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. సిట్‌లు ఏర్పాటు చేసినా కేసును ఛేదించలేకపోయారు. అంతేకాకుండా ఈ కేసులో పలు అనుమానాలున్నాయని, వైఎస్ జగన్ ఈ కేసు విచారణ విషయంలో సరిగ్గా వ్యవహరించడం లేదనే అర్థం వచ్చేలా వివేకా కుమార్తె సునీత పలు ఆరోపణలు చేశారు. ఈ కేసు విషయంపై వివేకా కుమార్తె సునీత కేరళలో సామాజిక కార్యకర్త జోమున్‌ని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిస్టర్ అభయ కేసులో పోరాటం సాగించి నిందితులకు శిక్షపడేలా చేసి జోమున్‌ను కలసి వివేకా హత్య కేసు, అనుమానాలు తదితర అంశాలపై సునీత మాట్లాడినట్టు సమాచారం.
షర్మిల పార్టీ ఏర్పాటు ఇష్టం లేదనే ప్రచారం
ఇక తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు చేయడం వైఎస్ జగన్‌కు ఇష్టం లేదనే ప్రచారం జరుగుతోంది. షర్మిల పార్టీ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని జగన్ కోరినట్టు గతంలో వైసీపీ ముఖ్యనేత సజ్జల కూడా వ్యాఖ్యానించారు. జగన్‌కి షర్మిలకి మధ్య విభేదాలు కూడా షర్మిల పార్టీ పెట్టేందుకు దారితీశాయన్న చర్చకూడా నడుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంల షర్మిల పులివెందులకు వెళ్లడం, వివేకా వర్ధంతి కార్యక్రమానికి హాజరుకావడం, వైఎస్ జగన్‌తో పాటు భారతీరెడ్డి గైర్హాజరు కావడం, అవినాష్ రెడ్డి కుటుంబీకులు కూడా దూరంగా ఉండడంపై రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
విజయమ్మ, షర్మిల కలసి వచ్చి..
కాగా వివేకా వర్దంతి సందర్భంగా పులివెందులలోని వివేకా ఘాట్‌కు వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల కలసి వచ్చారు. ప్రత్యేక కార్యక్రమాల అనంతరం కలసి వెళ్లిపోయారు. గతంలోనూ వైఎస్ సమాధి వద్ద ఇలాంటి పరిస్థితి తలెత్తిందని వైసీపీ నాయకులే చెబుతున్నారు. క్రిస్మస్, వైఎస్ జయంతి, వైఎస్ వర్ధంతి లాంటి కార్యక్రమాలకు కుటుంబమంతా కలసి వచ్చేవారని, అయితే కొన్నాళ్ల క్రితం షర్మిల ఒక్కరే వచ్చి వైఎస్ సమాధి వద్ద కాసేపు కూర్చుండి వెళ్లారన్న చర్చకూడా గతంలో నడిచింది. తాజాగా వైఎస్ వివేకా వర్ధంతి కార్యక్రమానికి జగన్ , భారతీరెడ్డి హాజరు కాకపోవడంతో.. ఆ కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరాయా లేక మరేదైనా కారణం ఉందా అనే అంశంపై చర్చ నడుస్తోంది.
Must Read ;- తెలంగాణలో షర్మిల హై స్పీడ్.. 16లోపు కమిటీలు!