తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందా? తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువచ్చేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లి, వైఎస్ తనయ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్త సంచలనంగా మారింది. ఏపీలో రాజన్న రాజ్యం తీసుకువస్తారని షర్మిల, విజయలక్ష్మి భావించారని, కానీ ఏపీలో జగనన్న తమిళనాడు తరహా రాజకీయాలకు తెరతీశారని వారు ఆక్రోశంగా ఉన్నారని వార్తా కథకంలో వెల్లడించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి విజయమ్మ, షర్మిల, ఆమె భర్త అనిల్ తీవ్రంగా కృషి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో అధికారంలోకి వచ్చిక షర్మిలకు హామీ ఇచ్చిన రాజ్యసభ సీటు కూడా ఇవ్వలేదని దీంతో ఆమె మరింత రగిలిపోతున్నారని కథనం సారాంశం. అందుకే ఇటీవల పులివెందులలో క్రిస్మస్ వేడుకలకు షర్మిల హాజరు కాలేదని, స్వయంగా సీఎం జగన్ రెడ్డి ఫోన్ చేసినా షర్మిల అందుబాటులోకి రాలేదని ఆ పత్రిక అభిప్రాయపడింది. వారిద్దరి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయనడానికి ఇంతకంటే బలమైన సాక్ష్యం అవసరం లేదని ఆంధ్రజ్యోతి పత్రికా కథనంలో అభిప్రాయపడ్డారు.
ఏపీలో రాజన్న రాజ్యం తెచ్చేందుకు తెలంగాణలో పార్టీ ఏర్పాటు
జగన్ సీఎం అయితే రాజన్న రాజ్యం వస్తుందని అందరూ ఆశించారని, అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా గడచిన 20 నెలల్లో అలాంటి దాఖలాలు కనిపించలేదని వైఎస్ సన్నిహితులు చాలా మంది షర్మిల వద్ద వాపోయారని పత్రికా కథనంలో వెల్లడించారు. తెలంగాణలోనూ వైఎస్ కు పెద్ద ఎత్తున అభిమానులున్నారని పార్టీ ఏర్పాటు చేయాలని అలాంటి వారంతా షర్మిలపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఉటంకించారు. షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుసుకుని సోనియా గాంధీ కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారని పేర్కొన్నారు. బీజేపీ నేతలు కూడా షర్మిల ఏర్పాటు చేయబోయే కొత్తపార్టీపై ఓ కన్నేసి ఉంచారని, వచ్చే నెల రెండో వారంలోనే షర్మిల ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ప్రకటన చేస్తారని కథనం సారాంశం. తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ ఏర్పాటు తరవాత షర్మిల చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించి తెలంగాణ మొత్తం చుట్టివస్తారని కథనంలో వెల్లడించారు.
వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆమె చెల్లి షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ప్రత్యేక కథనం సారాంశం. ఈ కథనంలో కొన్ని నమ్మదగ్గ అంశాలు, మరికొన్ని ఊహకందని అంశాలు ఉన్నాయి. షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు నిజం కావచ్చు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. ఎప్పటి నుంచో తెలంగాణా వైసీపీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏపీ పార్టీలు తెలంగాణలో మనుగడ సాగించే అవకాశం లేదు కాబట్టి… కొత్త పార్టీ ఏర్పాటు చేసి దాని పేరు ముందు తెలంగాణ అని తగిలిస్తే అది తెలంగాణ పార్టీ అయిపోతుంది. జనంలోకి వెళ్లడానికి కూడా బాగుంటుందని షర్మిల భావించి ఉండవచ్చు.
కథనంలో అంశాలన్నీ నిజాలేనా?
ఆంధ్రజ్యోతి కథనంలో ఉన్న సంగతులన్నీ నూరుశాతం నిజమేనా? అనే అనుమానం కూడా ప్రజల్లో ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డితో వైరం నిజం కాకపోవచ్చు. ఎందుకంటే జగన్‌ను కాదని షర్మిల సాధించేది ఏమీ లేదనేది వాస్తవం. జగన్ అధికారంలోకి రావడానికి విజయమ్మ, షర్మిల, అనిల్ ఉపయోగపడి ఉండవచ్చు కానీ, జగన్‌ను ధిక్కరించి షర్మిల ఏపీలో కూడా పార్టీ పెట్టే అవకాశాలు లేవు. ఎలాగూ తెలంగాణలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. అక్కడ మరలా దానికి జీవంపోసి అధికారంలోకి తీసుకురావడం సాధ్యమేకాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తోందంటే, అది జగన్ పై కోపంతో కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం మాత్రం దీనికి భిన్నంగా ఉంది.
సగం నిజమే, సగం నమ్మశక్యం కావడం లేదు
జగన్, షర్మిల వైరం అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంలో వాస్తవాలకంటే కల్పితాలే ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది. షర్మిల పార్టీ ఏర్పాటు నూరుశాతం నిజం కావచ్చు. ఏపీలో రాజన్న రాజ్యం తెచ్చేందుకు, తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేస్తోందని కథనంలో వివరించారు. ఇది పెద్ద కామెడీ. ఏపీలో రాజన్న రాజ్యం తేవాలంటే, ఏపీలో కొత్త పార్టీ ఏర్పాటు చేయాలి. అన్నను ధిక్కరించి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి, రాజన్న రాజ్యం అంటే ఏమిటో జనానికి రుచి చూపించాలి. అంతేకాని తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేసి రాజన్న రాజ్యం తీసుకురావడం అంటే ఇందులో అనేక రాజకీయ వ్యూహాలు దాగిఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. జగన్ రెడ్డి మద్దతు లేకుండా తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తుందని ఊహించలేం.
ఆ ఊహలేమిటో, వ్యూహాలేమిటో అంచనా తెలియాల్సి ఉంది.