తెలంగాణలో పార్టీ స్థాపనకు షర్మిల శరవేగంగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే వైఎస్ అభిమానులు, అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలేంటి? వ్యతిరేకతలేంటి? అనే అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కమిటీల ఏర్పాటుపై దృ వైఎస్ష్టి సారించారు. గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి.. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
మరో ముందడుగు..
తెలంగాణలో వైఎస్ అభిమానులను ఏకం చేసి పార్టీని ముందుకు నడిపించాలని షర్మిల భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను సైతం తనవైపు మలచుకోవాలని యత్నిస్తున్నారు. ఇవన్నీ చేయాలంటే.. క్షేత్రస్థాయిలో కమిటీలు అవసరమని భావించారు. ఈనెల 16వ తేదీలోపు గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మండలానికి ముగ్గురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.
రామ్‌రెడ్డికే బాధ్యతలు..
వైఎస్ అభిమాని, అనుచరుడైన పిట్టా రామ్‌రెడ్డికి కమిటీల ఏర్పాటు బాధ్యతను అప్పగించారు. కమిటీల ఏర్పాటులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను షర్మిల.. రామిరెడ్డికి ముందే సూచించారు. పార్టీ ఏర్పాటు కోసం ముందు నుంచి తనతో కలిసి వచ్చేవారు, వైఎస్ అభిమానులతో కమిటీలు రూపొందించాలని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 1200 మందికి బాధ్యతలు అప్పగించనున్నట్టు సమచారం.