ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది కాగ్నిజెంట్. విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ట్వీట్ చేసింది. విశాఖలోని కాపులుప్పాడలో 22 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది. నూతన క్యాంపస్‌తో సుమారు 8 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని కాగ్నిజెంట్ తెలిపింది. ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగంలో ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేసింది. 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని పేర్కొంది. కంపెనీ విస్తరణకు సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
కాగ్నిజెంట్ ట్వీట్‌పై స్పందించారు మంత్రి నారా లోకేష్. విశాఖను ఎంచుకున్నందుకు కాగ్నిజెంట్‌కు కృతజ్ఞతలు తెలిపారు లోకేష్. ఇది కేవలం ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే కాదన్నారు లోకేష్. ఏపీ యువతలో కాన్ఫిడెన్స్‌ను పెంచుతుందన్నారు. విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీని గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ ఉద్యోగాల పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యమన్నారు. ఏపీ అభివృద్ధికి కలిసి పని చేద్దామని కాగ్నిజెంట్‌కు పిలుపునిచ్చారు లోకేష్. సన్‌రైజ్ స్టేట్‌కు స్వాగతమంటూ కాగ్నిజెంట్‌కు ఆహ్వానం పలికారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడులు క్యూ కడుతున్నారు. ప్రధానంగా విశాఖను ఆంధ్రప్రదేశ్ ఐటీ రాజధానిగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే TCS విశాఖలో తన క్యాంపస్‌ను విస్తరించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఐటీ హిల్ నంబర్ 3 దగ్గర TCSకు 21.16 ఎకరాల భూమిని ఎకరానికి 99 పైసల చొప్పున కేటాయించారు. TCS రూ. 1,370 కోట్ల పెట్టుబడితో 12,000 నుంచి 15,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా. ఇక గూగుల్ ప్రతినిధి బృందం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించింది. అనంతపురం – నెక్కల్లు సమీపంలో స్థలాన్ని కూడా ఆ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు.











