జమ్మూ-కశ్మీర్ లో ప్రత్యేక జెండాను ఎగురవేసేందుకు అనుమతించినప్పుడే జాతీయ జెండాను కూడా ఎగురవేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి పీడీపీ అధ్యక్షురాలు మోహబూబా ముఫ్తీ వ్యాఖ్యలపై ఇటు భాజపా అటు కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆమె మాటలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని భాజపా ఆరోపించింది.
వెంటనే ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ భూమిపై ఏ శక్తి కూడా భారత త్రివర్ణ పతాకాన్ని తప్ప మరే ఇతర జెండాను ఎగురవేయలేదని భాజపా వ్యాఖ్యనించింది. ఇప్పటికైనా ముఫ్తీ ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే జరగబోయే పరిణామాలకు ఆమె బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
త్రివర్ణ పతాకం భారతీయుల ఐక్యత, సమగ్రత, త్యాగాలను చాటుతుందని..ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తక్కువ చేసి మాట్లాడవద్దన్నారు. ప్రజాస్వామ్య, చట్టబద్ధ పాలన కోసం పోరాడిన ఎంతో మంది త్యాగాలను కించపరిచినట్లవుతుందన్నారు.
ఆర్టికల్ 370 రద్దుతో ఉనికి కోల్పొయిన జమ్మూ-కశ్మీర్ ప్రత్యేక జెండాను ఐక్య పోరాటంతో తిరిగి సాధించుకుంటామని ముఫ్తీ మీడియాతో అన్న విషయం తెలిసిందే. తమ జెండాను తిరిగి ఇచ్చే వరకు మరో జెండా ఎగురవేయమన్నారు. ప్రత్యేక జెండాను ఎగురవేసేందుకు అనుమతించినప్పుడే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామన్నారు.