అసలే చలికాలం.. ఆపై కరోనా ఉండనే ఉంది.. అది చాలదన్నట్లు కొత్తరకం కరోనా అడుగుపెట్టింది దేశంలోకి.. మళ్లీ కరోనా అంకెలు మొదటికొచ్చాయి. చలికాలం కావడం కొద్దిగా జలుబు చేసినా.. ఏమాత్రం కాస్త దగ్గినా.. తుమ్మినా.. అమ్మో కరోనా అని భయపడిపోతున్నారు జనాలు. కరోనా అనే కాదు.. ఎలాంటి జబ్బులైనా మీ శరీరాన్ని ఆక్రమించాలంటే ముందుగా రోగనిరోధక శక్తితో పోరాడి గెలివాలి. దాన్ని ఓడిస్తేనే ఏ వ్యాధైనా మిమ్మల్ని బాధపెట్టగలదు. మరి మీకు.. రోగాలకు అడ్డుగోడలాగా నిలిచి మిమ్మల్ని రక్షిస్తున్న ఈ రక్షణ కవచానికి మరింత బలం చేకూర్చేది మీరు ఆరగించే ఆహారమే అనే విషయం మరవకండి. మరి రక్షణ కవచానికి బలం చేకూర్చాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం రండి..
సిట్రస్ పండ్లు
రోగనిరోధక శక్తని పెంచడంలో విటమిన్-సి ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరి విటమిన్-సి అందుకోవాలంటే సిట్రస్ ఫ్రూట్స్ మీ రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే సరి. నిమ్మ, బత్తాయి, కమలా పండ్లు, పాలకూర, టమాటాలు, కాలీఫ్లవర్, బెర్రీ జాతికి చెందిన పండ్లలో విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది.
అల్లం-వెల్లుల్లి
అల్లం-వెల్లుల్లి లేకుండా దాదాపు మన వంటలు పూర్తికావనే చెప్పాలి. ఇవి మీ శరీర రోగనిరోధక శక్తని పెంచి మీరు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఆహారంలో చేర్చుకోవడంతోపాటు.. టీ లాంటి వాటిలో అల్లం చేర్చుకోవడం వల్ల అటు రుచికి రుచి.. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం అంటున్నారు నిపుణలు. అంతేనా.. బరువు తగ్గాలనుకునే వారు కూడా నిమ్మ, అల్లం కలిపిన టీని తాగడం వల్ల శరీరంలోకి కొవ్వు కరిగి బరువు అదుపులోకి వస్తుంది.
Must Read ;- కొత్తరకం కరోనా వైరస్ లక్షణాలు ఏంటి? జాగ్రత్తలు, ఆహారం గురించి తెలుసుకోండి..
ఆకుకూరలు
వారంలో కనీసం రెండు సార్లైనా ఆకుకూరలు తీసుకోమని డాక్టర్లు సైతం సలహా ఇస్తుంటారు. ఇందులో ముఖ్యంగా బ్రొకలి, పాలకూరలలో విటమిన్-సి అధికంగా లభిస్తుంది. ఇన్‌ఫెక్షన్ లాంటివి దరిచేరకుండా ఇవి మిమ్మల్ని కాపాడుతాయి. అలర్జీ లాంటి సమస్యలను రూపుమాపుతాయి. మరి రోగనిరోధక శక్తి కావాలంటే ఆకుకూరలు లాగించేయాలి తప్పదు మరి!
పసుపు
భారతదేశంలోని ప్రతి వంటింటిలో చాలా సాధారణంగా కనిపించే పదార్థం ‘పసుపు’. భారతదేశ వంటాకాలు దాదాపు పసుపు వేయకుండా వండరు. ఇందులోని యాంటిబయాటిక్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడంతో తోడ్పడుతాయి. మిమ్మల్ని రోగాల బారిన పడకుండా కాపాడుతాయి.
Also Read ;- పొట్ట తగ్గాలా? అయితే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి!
బొప్పాయిపండు
పోషకాల గని ఈ నారింపు రంగు పండు. నారింజ రంగు అనగానే కమలాపండు అనుకునేరు.. కానే కాదు.. ఇది బొప్పాయిపండు.. సిట్రస్ పండ్లలో దొరికే విటమిన్-సి అధికంగా లభిస్తుంది బొప్పాయిపండులో. అంతేకాదు. బొప్పాయి తినడం ద్వారా అజీర్ణసమస్యలు కూడా పరిష్కారమవుతాయి. పొటాషియం, మెగ్నిషియం, ఫొలెట్ వంటి విటమిన్లు కూడా అందుతాయి.