టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో దిట్ట శర్వానంద్. తాజాగా తను ఒక వైవిధ్యమైన కథకు ఓకే చెప్పాడని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది. ఈ సినిమాకు ‘నేను శైలజ’ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా, సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర కొత్తగా ఉంటుందని సమాచారం.
శర్వానంద్ సినీ కెరియర్ లోనే ఈ సినిమా ఒక మంచి సినిమాగా నిలిచిపోతుందని అంటున్నారు. తిరుపతిలో అక్టోబర్ 25న అంటే రేపే దసరా కానుకగా దర్శకనిర్మాతలు ఈ కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ రానున్నట్టు సమాచారం. ఇప్పటికే దర్శకుడు కథను పక్కాగా రెడీ చేసుకున్నాడని, సింగిల్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం.
ఇప్పటికే కరోనా కారణంగా శర్వానంద్ ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ మధ్యలోనే ఆగిపోయాయి. ఆ సినిమాలు పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా షూటింగ్ లో శర్వానంద్ పాల్గొంటాడని తెలుస్తోంది. కరోనా సమయంలో కాస్త నెమ్మదించిన శర్వానంద్ ఇక జెట్ స్పీడులో అభిమానులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాడన్నమాట. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ఈ నెల 25వ తేదీ వరకు ఆగాల్సిందే.











