మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తన సతీమణి సునీతా రఘువీర్‌తో పాటు టీవీఎస్ మోపెడ్‌పై వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం కాగా.. పోలింగ్ కేంద్రం మాత్రం అక్కడకు మూడు కిలోమీటర్ల దూరంలోని గంగులవాయిపాళ్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుదారులు రెండు చోట్ల విజయం సాధించారు. రఘువీరా ఇలాకాలోని గంగులవాయిపాళ్యంతోపాటు గోవిందాపురం పంచాయతీలోనూ కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు.
రఘువీరా.. ఎందుకిలా..!
ఆయన.. ఒకప్పటి రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు. దశాబ్దాల పాటు కీలక మంత్రిగా చక్రం తిప్పారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు నెలవైన అనంతపురం జిల్లాలో రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. తిరుగులేని నేతగా ఎదిగారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్.. తన ప్రాభవం కోల్పోవడంతో.. నేతలందరూ పక్క పార్టీల్లోకి వెళ్లిపోయినా.. తనకు రాజకీయ జన్మనిచ్చిన అమ్మలాంటి పార్టీని వదల్లేక పోయారు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని నిలబెట్టేందుకు ఎనలేని కృషి చేశారు. పార్టీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా.. నేటికీ కాంగ్రెస్ వాదిగానే కొనసాగుతున్నారు. కాకపోతే.. క్రియాశీల రాజకీయాలకు కాస్తంత దూరంగా.. తన గ్రామంలో.. ప్రశాంతమైన వాతావరణంలో.. అన్నదాతగా మారి వ్యవసాయం చేసుకుంటున్నారు. కలుషితమైపోయిన రాజకీయాల కన్నా.. తనకు రైతుగా జీవించడమే అత్యంత సంతృప్తినిస్తోందని చెబుతున్నారు. దశాబ్దాల పాటు రాజకీయాలను ఏలిన ఈ ఉద్దండ నేత.. ప్రస్తుతం మౌన మహర్షిలా మారిపోయారు. అస్త్ర సన్యాసం చేసిన అశోకుడిలా కనిపిస్తున్న ఆయనే.. మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎస్ రఘువీరారెడ్డి. రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. తన గ్రామంపై పట్టును మాత్రం కోల్పోలేదు. రాష్ట్రంలో కుదేలైపోయిన కాంగ్రెస్ పార్టీని.. తన ప్రాంతంలో రెండు గ్రామాల్లో గెలిపించుకున్నారు.
Must Read ;- ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికలు .. కోడిపల్లిలో ఎన్నికలు వాయిదా..