ఒకప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకుంటే చాలు అనేవారు.. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే నాలుగు పాటలు వెనకేసుకోవాలేమో అనిపిస్తోంది. అలా వెనకేసుకుంటే అది ఎప్పటికైనా మీకు కాసులు కురిపించవచ్చు.
ఇలాంటి పాటల కోసం మీరు పెద్దగా కష్టపడాల్సింది ఏమీ లేదు.. పల్లె పల్లెకూ తిరుగుతూ పాటలు పాడే వృద్ధులను కదిపితే బోలెడు పాటలు దొరికేస్తాయి. వారి చేతిలో పదో పరకో పెట్టేసి ఆ పాటను సినిమా జనానికి అమ్మేస్తే డబ్బే డబ్బు. అందుకే పల్లెకు పోండి.. పాటను తెచ్చుకుని పదిలపర్చుకోండి. అసలు పాట పుట్టిందే పల్లె నుంచి. ఈ మధ్య కాలంలో సినిమాల్లో జానపద పాటలకు మంచి గిరాకీ ఉంది. చాలామంది పాటల రచయితలు ఈ సేకరణ పాటల కోసం ఎగబుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. తమకు దొరికిన పల్లవి, చరణాలకు మరికొన్ని పదాలను చేర్చి ఇది నా పాటే అని చెప్పేసుకునేవారు ఎక్కువై పోయారు.
ఇపుడీ పాటల కోసం కొట్టకునే పరిస్థితి ఏర్పడింది. ఇది నా పాటని ఒకరు.. కాదు నాది అని ఇంకొరు టీవీల దాకా ఎక్కేస్తున్నారు. పైగా ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉండటంతో అందరూ అభాసుపాలు కావలసి వస్తోంది. అంతేకాదండోయ్ ఒకప్పుడు అగ్రశ్రేణి రచయితల పరువు కూడా తీసి రోడ్డున పడేస్తున్నారు. పాటలపై ఈ వివాదం ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పుడు మాత్రం ‘లవ్ స్టోరీ’ సినిమాలోని ‘సారంగ దరియా’ పాట పెద్ద వివాదానికి తెరతీసింది.
కోమలి అనే జాన పద గాయని ఇది తన అమ్మ నుంచి తను నేర్చుకున్న పాట అని, దీన్ని సుద్దాల అశోక్ తేజ సొంతం చేసుకున్నారని వాపోతోంది. పైగా తను ఇలాంటి వంద పాటలు వెనకేసుకున్నానని కూడా అంటోంది. దీనికి సుద్దాల అశోక్ తేజ్ ఇచ్చే జవాబు మరోలా ఉంది. ఈ పాటను తాను కూడా తన తల్లి దగ్గర విన్నానని, జాన పద పాటల మీద ఎవరికీ ఎలా హక్కూ లేదని వాదిస్తున్నారు. వీరిద్దరి మధ్యలో ఈ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా నలిగిపోతున్నారు.
సుద్దాల మీద గతంలోనూ వివాదమే..
సినీ గేయ రచయితగా పేరు తెచ్చుకున్న సుద్దాల అశోక్ తేజకు ఈ వివాదం మొదటి సారి కాదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమా కోసం ఆయన రాసిన ‘నేను సైతం ప్రపంచాగ్నికి’ పాటకు ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు. అందులో శ్రీశ్రీ రాసిన పదాలను ఎత్తేశారన్న అపనిందను ఆయన మోశారు. జ్యూరీ దృష్టికి కూడా ఈ వివాదం వెళ్లినా పాటలో కొన్ని పదాలు మాత్రమే అలా ఉన్నాయి కాబట్టి ఫర్వాలేదు ఈ పాటకు అర్హత ఉంది అని ఉత్తమ గీతంగా దాన్ని ఎంపిక చేశారు.
దాదాపు 2000 పాటలు దాకా సుద్దాల అశోక్ తేజ రాశారు. అందులో ‘ఒకటే జననం ఒకటే మరణం’ స్ఫూర్తిమంతమైన గీతాలతోపాటు ‘వచ్చిండే మల్ల మెల్లగా వచ్చిండే’ లాంటి చిలిపి గీతాలూ ఉన్నాయి. కాకపోతే ఇలాంటి కాపీ మరకలు అంటినప్పుడు అప్రతిష్ఠపాలు కావలసి వస్తోంది. పాటలోని సాహిత్యం మాత్రమే కాపీ అయితే ఫరవాలేదు ఒక్కోసారి ఆ ట్యూన్ కూడా యథాతథంగా ఎత్తేస్తున్నారు. కాపీ అనేది కథలతోనే ఆగలేదు అన్ని విభాగాలకూ ఇది విస్తరించింది. ఎవరో రాసిన పాటలను వాడేసుకోవడం, ఇంకెవరో చేసిన ట్యూన్లను ఎత్తేయడం తరచూ జరిగే తంతే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి పాట ఉంటే ఆ మజాయే వేరని ఇంతకుముందు ‘ఫిదా’ నిరూపించింది.
సాయిపల్లవి పాట ఉంటే ఆ డ్యాన్సుల స్పీడుకు తగ్గట్టుగా ఓ పాట ఉండాలనే ఉద్దేశంతో శేఖర్ కమ్ముల సుద్దాల అశోక్ తేజను సంప్రదించారు. వెంటనే సుద్దాల అశోక్ తేజ ‘సారంగ దరియా’ పాట రాసి ఇచ్చారు. మాటీవీలో గతంలో రేలారేలారే అనే ఓ జానపద కార్యక్రమంలో కోమలి అనే జానపద గాయని ఈ పాటని పాడింది. ఆ కార్యక్రమానికి జడ్డిగా సుద్దాల అశోక్ తేజ వచ్చారు. కోమలికి ఎలాంటి క్రెడిట్స్ ఇవ్వకుండా ఇలా పాటను వాడేయడం వివాదాస్పదమైంది. జానపద పాట అనేది అందరిదీ.. అది ఏ ఒక్కరి సొత్తూ కాదన్నది సుద్దాల అశోక్ తేజ వాదన.
అసలు మంగ్లీ గొంతు ఆ పాటకు సరిపోలేదని, కనీసం తనతోనైనా ఆ పాటను పాడించి ఉంటే బాగుండేదన్నది కోమలి వాదన. కోమలితోనే పాటలను పాడిద్దామని అడిగామని, ఆమె పదిరోజులు టైమ్ కావాలని అడగడం వల్లే ఆమెకు అవకాశం ఇవ్వలేకపోయామన్నది చిత్ర యూనిట్ వాదన. ఈ ఒక్క పాట విషయంలోనే కాదు భవిష్యత్తులో కూడా ఇలాంటి పాటల విషయంలో వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో జానపద పాటలు జనంలోకి వెళ్లిపోయి ఉన్నాయి. ఎవరైనా సోషల్ మీడియా ముఖంగా ఆ పాటను పాడి ఉంటే వారికి కాపీరైట్ దక్కుతుందేమో. తన దగ్గర 100 పాటల దాకా ఇలాంటి ఉన్నాయని కూడా కోమలి అంటోంది.
ఒక్క కోమలి దగ్గరే వంద పాటలు ఉంటే మిగతావారి దగ్గర ఇంకెన్ని ఉన్నాయో. సినిమా సంగీత దర్శకులు కమర్షియల్ పాటల రచయితల నుంచి కాకుండా ఇలాంటివారి దగ్గరి నుంచే ఈ పాటలు తీసుకోవడం మంచిదేమో. లేదా ఇలాంటి సేకరణ పాటలకు కాపీరైట్ తెచ్చుకుని ఉంటే ఏ గొడవా ఉండదు. లేకుంటే కోమలి వర్సెస్ సుద్దాల అశోక్ తేజ మాదిరిగా మరికొందరు తెరపైకి వచ్చే ప్రమాదమూ పొంచి ఉంది.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- లవ్ స్టోరీ నుంచి దుమ్మురేపేయనున్న సాంగ్