తెలుగు .. తమిళ భాషల్లో సాయిపల్లవికి విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకు కారణం ఆమె చేసిన సినిమాలు .. పాత్రలు. సాధారణంగా చాలామంది కథానాయికలకు కథ చెప్పవలసిన అవసరం లేదు. కాంబినేషన్ చెబితే సరిపోతుంది .. పారితోషికం ఫైనల్ చేస్తే సరిపోతుంది. కానీ సాయిపల్లవి విషయంలో అలా కాదు, కాంబినేషన్ కాదు .. కథనే చెప్పాలి. తన పాత్ర గురించి ఆమెకి పూర్తిగా చెబితేనే తప్ప గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. అందువలన కథ విషయంలో సాయిపల్లవిని ఒప్పించడం కష్టమేనని అంటారు.
ఓ సినిమాకి సంబంధించిన దర్శక నిర్మాతలు ప్రస్తుతం ఆమెను ఒప్పించే పనిలోనే ఉన్నారట. హీరో జోడీగా సాయిపల్లవిని అడగడానికి వెళితే అది వేరే విషయం. కానీ ఒక కమెడియన్ కి జోడీగా అడగడానికి ఆమె దగ్గరికి వెళ్లడమనేది కాస్త సాహసంతో కూడుకున్న పనే. తమిళంలో హాస్యనటుడిగా ‘కాళి వెంకట్’కి మంచి పేరు ఉంది. ఆయన కథానాయకుడిగా ఒక సినిమా చేయడానికి రంగం సిద్ధమైంది. హీరోయిన్ గా సాయిపల్లవి అయితే బాగుంటుందనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారట. కథ .. ఆమె పాత్ర గురించి కూడా వివరించారట.
అయితే సాయిపల్లవి ఏ నిర్ణయం తీసుకుంటుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కథ .. తన పాత్ర నచ్చితే, హీరో ఎవరనేది ఆమె పెద్దగా పట్టించుకోదనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. తనకి గల క్రేజ్ గురించి ఆలోచన చేస్తుందిగదా? అని మరికొందరు అంటున్నారు. మరి సాయిపల్లవి ఏం చేస్తుందన్నది చూడాలి. ఇక తెలుగులో ఆమె చేసిన ‘లవ్ స్టోరీ’ .. ‘విరాటపర్వం‘ విడుదలకి ముస్తాబవుతున్నాయి. నానీ సరసన నాయికగా చేస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్‘ సెట్స్ పై ఉంది. ఈ ఏడాది సాయిపల్లవి తెలుగులో తన జోరు చూపనుందనే విషయం మాత్రం అర్థమవుతోంది.
Must Read ;- తేజకు షాక్ ఇచ్చిన సాయిపల్లవి