ప్రేమకథల స్పెషలిస్టుగా శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. ఆయన తాజా చిత్రంగా ‘లవ్ స్టోరీ‘ రూపొందింది. నాగచైతన్య – సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఉంది. శేఖర్ కమ్ముల సినిమాల్లో కథాకథనాలు కొత్తగా ఉంటాయి. పాత్రలు ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఇక పాటల విషయానికొస్తే, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేవిగా ఉంటాయి. ఇంతకుముందు ఆయన నుంచి వచ్చిన సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాయి. అదే దారిలో ఆయన లవ్ స్టోరీ’ని నడిపించనున్నాడు.
నారాయణ దాస్ నారంగ్ – రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకి, పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు పాటలకు కూడా మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రేపు (28వ తేదీ .. ఆదివారం) ఉదయం 10:08 నిమిషాలకు మూడో పాటను విడుదల చేయనున్నారు. సమంత చేతుల మీదుగా ఈ పాట జనంలోకి వెళ్లనుంది. ఆ పాటకి సంబంధించిన ప్రోమోతో ఈ విషయాన్ని ప్రకటించారు.
‘సారంగా ధరియా .. ‘ అంటూ సాగే ఈ పాట చిన్న బిట్ చూస్తుంటేనే, ఈ పాట దుమ్మురేపేయడం ఖాయమనిపిస్తోంది. ఇక పాటలో సాయిపల్లవి డాన్స్ ఒక రేంజ్ లో ఉంటుందనే విషయం కూడా అర్థమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాట ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే అనిపిస్తోంది. ఈ పాటలో సాయిపల్లవి నెమలి నడకలు .. హంస వయ్యారాలు చూడాలంటే, రేపు పాట విడుదల వరకూ వెయిట్ చేయవలసిందే. ఏప్రిల్ 16వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Must Read ;- టీజర్ టాక్: చైతు, సాయిపల్లవిల ‘లవ్ స్టోరీ’కి ఫిదా