అనంతమైన భావాలను అందంగా .. రాగయుక్తంగా .. సంక్షిప్తంగా చెప్పే సాధనమే పాట. వేల మాటలు చెప్పలేని అర్థాన్ని ఒక్క పాట చెబుతుంది. లక్ష భావాలను లక్షణంగా ఒకే ఒక్క పాట విప్పగలుగుతుంది. పాటకున్న ప్రత్యేకత అలాంటిది. అలాంటి పాటను రాయడం అంతతేలిక కాదు .. రక్తి కట్టించడం అంత సులభమూ కాదు. అంతటి కష్టతరమైన ప్రక్రియను అలవోకగా సాగించిన పాటల రచయితలు కొందరే ఉన్నారు. అలాంటివారి జాబితాలో వేటూరి సుందరరామమూర్తి ముందువరుసలో కనిపిస్తారు.
కృష్ణాజిల్లా .. మోపిదేవి మండలం .. ‘పెదకళ్లేపల్లి’ గ్రామంలో వేటూరి జన్మించారు. తెలుగు సాహిత్యాన్ని వంటబట్టించుకుని, పాటల కోటలో పాగా వేయాలనే సంకల్పంతో ఆయన చెన్నైకి చేరుకున్నారు. తెలుగు పాటకి మరింత పరిమళాన్ని అద్దడానికీ .. మరింత మాధుర్యాన్ని తీసుకురావడానికి రంగంలోకి దిగారు. ‘ఓ సీతకథ’ సినిమాతో దర్శకులు కె.విశ్వనాథ్ ఆయనకి తొలిసారిగా అవకాశం ఇచ్చారు. అలా 1974 నుంచి వేటూరి తన కలాన్ని కాలంతో సమానంగా పరిగెత్తించారు. తెలుగు పాటకు తాను తెరచాపగా మారిపోయి మనోహరమైన మరో తీరానికి చేర్చారు.
అప్పటివరకూ తెలుగులో ఫలానా పాటను ఫలానా కవిగారు బాగా రాస్తారు అని చెప్పుకునేవారు. ఒకరు అభ్యుదయ గీతాలు .. మరొకరు భావగీతాలు .. ఇంకొకరు జానపదగీతాలు .. వేరొకరు శృంగారగీతాలు రాసేవారు. అయితే తాను అన్నిరకాల పాటలను రాయగలనని నిరూపించుకోవడానికి వేటూరికి ఎక్కవ సమయం పట్టలేదు. పాట రాయించుకోవడానికి ఎవరూ రాలేదని చెప్పేసి ఆయన తన పెన్నుకు క్యాప్ పెట్టే అవసరమూ రాలేదు. ఆయన ఓ పాటల గని .. ఆయన ఓ పాటల ముని అనే విషయం అందరికీ అర్థమైపోయింది.
పాటే ధ్యాసగా .. పాటే శ్వాసగా .. వేటూరి ప్రస్తానం సాగింది. పాట కోసం ఆయన బుర్రబద్దలు కొట్టుకున్న సందర్భాలు ఉండేవికాదు. పదాల కూర్పు కోసం పాట్లు పడుతూ పచార్లు చేయడం ఆయనకి అలవాటు లేదు. సన్నివేశం .. సందర్భం చెబితే చాలు, నుంచున్న చోటునుంచి కదలకుండా .. కూర్చున్న చోటునుంచి లేవకుండా ఆయన పాటను పూర్తిచేసేవారు. అలా ఆయన అప్పటికప్పుడు రాసిన ఎన్నో పాటలు ఇప్పటికీ జనం నాల్కులపై నాట్యం చేస్తూనే ఉన్నాయి. వేటూరి కవితా వైభవాన్ని దశదిశలా చాటుతూనే ఉన్నాయి.
Must Read ;- మరణానంతరం పద్మవిభూషణుల్లో బాలు
వేటూరి పాటల్లో సంగీత సాహిత్యాలు పెనవేసుకుపోయి కనిపిస్తాయి .. జోడు గుర్రాల్లా పరుగులుతీస్తూ వీనులవిందు చేస్తాయి. కదను తొక్కే ఆయన కలానికి భక్తి శృంగారాలను పలికించడం తెలుసు .. వీర రౌద్ర శోక రసాలను ఒలికించడమూ తెలుసు. కాలంతో పాటు కలాన్ని పరిగెత్తించడం .. పదాలను పదునుగా .. ఒడుపుగా ప్రయోగించడమూ తెలుసు. సందర్భాన్ని .. పాత్రల స్వరూప స్వభావాలను అర్థం చేసుకుని ప్రేక్షకుల మనసుకు దగ్గరగా పాటను ఆవిష్కరించడంలో ఆయన ఆరితేరారు. ప్రేక్షకుల హృదయాకాశంలో పాటల పావురాళ్లను ఎగరేసి సాహిత్య సార్వభౌముడు అనిపించుకున్నారు.
పాటలందు వేటూరి పాటలు వేరయా అని నిస్సందేహంగా చెప్పవచ్చు. సిరిసిరిమువ్వలు .. శంకరాభరణం .. సాగర సంగమం .. సప్తపది .. సీతాకోకచిలుక .. వంటి కళాత్మక చిత్రాల్లో వేటూరి చేసిన పద విన్యాసాలు .. వెదజల్లిన సాహిత్య సౌరభాలు మధురమైనవి .. మనసుకు హత్తుకుపోయేవని చెప్పాలి. ‘అబ్బనీ తియ్యని దెబ్బా’ అంటూ మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించడం .. ‘స్వరరాగ గంగా ప్రవాహమే’ అంటూ సంగీత సాహిత్య ప్రియులను అలరించడం వేటూరికి మాత్రమే సాధ్యమైంది. తరలవారీగా మాస్ ఆడియన్స్ ను మంత్రిస్తూ .. క్లాస్ ఆడియన్స్ కట్టి పడేసిన ఘనత ఆయన సొంతమైంది.
ఆవేదన .. ఆక్రోశం .. ఆనందం .. ఆవేశం .. వినోదం .. విషాదం .. ఇలా భావాలన్నీ వేటూరి కలానికి దాసోహం అన్నాయి, అక్షరాలన్నీ ఆయన కలం కనుసన్నలలో మెలిగాయి. పాట ఏదైనా .. భావమేదైనా ఆయన శైలి అసమానం, ఆయన అక్షరాల్లోని అందాలు .. పదాల్లోని సొగసులు అనితర సాధ్యాలు. ‘అద్వైత సిద్ధికి అమరత్వ లబ్దికి గానమే సోపానము’ .. ‘నరుడి తలపు నటన ఈశ్వరుడి తలపు ఘటన’ .. ‘పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులోకం’ ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ .. ‘పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు’ .. ‘నువ్వు పట్టుచీరకడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ’ అంటూ ఆయన చేసిన భావ విన్యాసం వేటూరి ప్రతిభకు అద్దం పడతాయి.
శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వపు ఆనవాళ్లు .. కృష్ణశాస్త్రి భావకవిత్వపు జాడలు .. వేటూరి సాహిత్యంలో కనిపిస్తాయి. ఆత్రేయ .. ఆరుద్ర .. సినారె వంటి అతిరథుల శైలి వేటూరి పాటల్లో అమరినట్టుగా అనిపిస్తుంది. అందుకేనేమో ఎన్నో అవార్డులు .. మరెన్నో రివార్డులు వేటూరిని అభిమానంతో పలకరించాయి. ఆత్మీయంగా ఆయన ప్రతిభకు పట్టాభిషేకం చేశాయి. వేల పాటల వేటూరి .. జోల పాటల మొదలు అన్నిరకాల సాహిత్య ప్రక్రియలను స్పృశించారు .. అన్నివర్గాల ప్రేక్షకులను .. శ్రోతలను అలరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే వేటూరి పాటలెప్పుడూ వెలుగు రేఖలే .. పదే పదే మనసు దోచే పారిజాత మాలికలే.
Also Read ;- లిటిల్ ఛాంపియన్ టు ఇండియన్ ఐడల్.. ‘షణ్ముఖ ప్రియ’..
వేటూరి ఓ పాటల ప్రపంచం .. వేటూరి ఓ పాటల ప్రవాహం. 3 దశాబ్దాలకి పైగా ఆయన తెలుగువారిని పాటల తోటలో షికారు చేయించారు. పాటకి పట్టం కట్టిన రుషిగా 8 నంది బహుమతులను అందుకున్నారు. వేటూరి భౌతికంగా లేకపోవచ్చునేమోగానీ, ఆయన పాటలకు వెయ్యేళ్ల ఆయుష్షు ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అప్పటివరకూ ఆయన మనసు మనసును పలకరిస్తూనే ఉంటారు .. పాటల రెక్కలపై అనుభూతుల ఆకాశంలో విహరింపజేస్తూనే ఉంటారు. ఈ రోజున ఆయన జయంతి .. ఈ సందర్భంగా ఆయనను ‘ది లియో న్యూస్’ స్మరించుకుంటోంది.
— పెద్దింటి గోపీకృష్ణ