(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఇటీవల రాజకీయ ప్రకంపనలకు కేంద్ర బిందువుగా మారిన ఆంధ్రా భద్రాద్రిగా పేరు గాంచిన .. విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థంలో సీతాసమేత శ్రీరామలక్ష్మణ విగ్రహాల పునఃప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర దేవాదాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. 28వ తేదీన స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తారు. నేటి తెల్లవారు జాము నుంచి ఈ విగ్రహాలకు ఆగమశాస్త్రం ప్రకారం ప్రత్యేక పూజలు, యజ్ఞయాగాదులను నిర్వహిస్తున్నారు.
శతాబ్దాల చరిత ..
శతాబ్దాల చరిత్ర గల రామతీర్థం ఆలయంలోని శ్రీ కోదండరాముని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల ధ్వంసం చేసిన విషయం, స్వామివారి విగ్రహం నుంచి తలను వేరు చేసి దాన్ని రామతీర్థం కోనేటిలో పడేసిన విషయం తెలిసిందే.. ఈ ఘటన పెను రాజకీయ దుమారానికి దారి తీసింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య ఈ వ్యవహారం అగ్గిలో ఆజ్యం పోసింది. వీరితో పాటు జనసేన, బీజేపీ నేతల రాజకీయపరమైన దాడులకు కారణమైంది. రాముల వారి విగ్రహం నుంచి తలను వేరు చేసిన ఘటన పట్ల దేశవ్యాప్తంగా హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
టీటీడీ నేతృత్వంలో
రామతీర్థంలో ధ్వంసమైన రాముల వారి విగ్రహం స్థానంలో కొత్త మూర్తులను రూపొందించే బాధ్యతను ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించింది. తిరుపతి అలిపిరి సమీపంలోని శ్రీవేంకటేశ్వర శిల్పకళాశాలలో కొత్త విగ్రహాలను టీటీడీ అధికారులు తయారు చేయించారు. ఈ విగ్రహాలు రామతీర్థానికి చేరుకున్నాయి. ప్రస్తుతం బాలాలయంలో భద్రపరిచారు. నేటి నుంచి మూడు రోజుల పాటు అక్కడే స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. యజ్ఞయాగాదులను నిర్వహిస్తారు. దీనికోసం పలువురు అర్చకులను దేవాదాయ శాఖ అధికారులు రామతీర్థానికి ఆహ్వానించారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
రామతీర్థం క్షేత్రం అభివృద్ధి పనులకు కూడా అదేరోజు శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. రామతీర్థాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలను వ్యయం చేయనుంది. 700 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయ నిర్మాణం పూర్తి రాతి కట్టడాలతో చేపడతారు. దేవాలయ పరిసరాల ప్రాంతం మొత్తం విద్యుద్దీపాల సౌకర్యాన్ని కల్పిస్తారు. శాశ్వత నీటి వసతి, ప్రహరీ గోడ నిర్మాణం, హోమశాలను నిర్మిస్తామని ప్రభుత్వం ఇదివరకే వెల్లడించింది. పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, దేవాదాయ శాఖ అధికారులు హాజరు కానున్నారు.
Must Read ;- అన్యాయాన్ని ప్రశ్నించినవారిని అరెస్ట్ చేస్తారా ? : కళా