దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గురువారం రాత్రికి దేశంలో గడిచిన 24గంటల్లో 2,17,353 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 61,695 కేసులు నమోదుకాగా యూపీలో 22,339 కేసులు, ధిల్లీలో 16,699 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో గత 24గంటల్లో 3,840 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 505 కేసులు ఉన్నాయి. ఏపీలో 5,086 కేసులు గురువారం ఒక్కరోజే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ బారిన పడినవారి చేరికతో ఆసుపత్రులు ఫుల్ అవుతున్నాయి. ప్రస్తుతం బెడ్‌లు దొరకడం కూడా కష్టంగా మారిందన్న వార్తలు ఓవైపు వస్తున్నాబెడ్లు దొరికినా ఆక్సిజన్ కొరత మరో సమస్యగా మారనుందనే వార్తలూ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
తెలంగాణలో..
తెలంగాణలోనూ ఆక్సిజన్ కొరత ఉన్నట్లు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హుజూర్‌నగర్‌లో మంత్రి ఈటల వ్యాఖ్యానించారు. తెలంగాణలోని అత్యవసర విభాగాలున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో వారానికి సరిపడా ఆక్సీజన్ నిల్వలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో అన్ని ఆసుపత్రుల్లో కలిపి రోజుకు 100 మెట్రిక్ టన్నుల (బి-టైప్) మెడికల్ ఆక్సిజన్ అవసరం ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. కొన్ని పెద్ద ఆసుపత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ వ్యవస్థలు ఉన్నా.. తక్కువ సంఖ్యలో ఉండడంతో ఆక్సిజన్ సిలిండర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో మార్కెట్లో ఆక్సిజన్ ధరలు పెరిగాయి. ఏడు క్యుబిక్ మీటర్ల ఆక్సిజన్ సిలిండర్ ధర (సిలిండర్ కాకుండా) 218 రూపాయలు ఉండగా ఇప్పుడు 450 రూపాయలకు పెంచినట్లు తెలుస్తోంది. అయినా ఆక్సిజన్ సరఫరా ప్రస్తుత అవసరాలకు సరిపడా లేకపోవడంతో మంత్రి ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందనే చర్చ నడుస్తోంది.
ఏపీలో..
ఏపీ విషయానికి వస్తే..వైజాగ్ స్టీల్ ప్లాంట్ గతేడాది వివిధ ఆసుపత్రులకు 120 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వంద టన్నులకు మించి ఇవ్వలేమని తేల్చేసింది. దీంతో విశాఖ కేజీహెచ్ కి కూడా సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందని ముందే గ్రహించిన కేజీహెచ్ 13, 20 టన్నుల భారీ ఆక్సిజన్ ట్యాంకర్లు ఏర్పాటు చేసుకుంది. ఇక విజయవాడ ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ కొరత తలెత్తింది. నిర్ణీత అవసరాల్లో 40శాతం మాత్రమే ప్రస్తుతం సరఫరా చేస్తుండడంతో టెన్షన్ మొదలైంది. ఇక ఇదే అదనుగా రీఫిల్లింగ్ కేంద్రాలు ఒక్కో ఆక్సీజన్ సిలిండర్ కు రూ.5లీటర్లకు 15వేలు, పది లీటర్లకు రూ.20వేలు వసూలు చేస్తున్నాయి. డిమాండ్‍కు తగ్గస్థాయిలో ఏజెన్సీలు సరఫరా చేయలేకపోతున్నాయి. ఇక తెలుగు రాష్టాలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాలని భావించినా..దేశ వ్యాప్తంగా కొరత ఉండడంతో ఇతర రాష్ట్రాలు ఎంతవరకు సహకరిస్తాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
దేశ వ్యాప్తంగా సమస్య..
దేశ వ్యాప్తంగా కూడా ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోవడంతో కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే అలర్ట్ అయిన మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు అక్సిజన్ నిల్వలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలకు చత్తీస్‌ఘడ్, కర్ణాటకల నుంచి మాత్రమే దిగుమతికి అవకాశం ఉంది.
అత్యవసర పరిస్థితిలో..
కాగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నందున కేంద్ర ప్రభుత్వంలోని విభాగాలతో పాటు, ప్రైవేటు సంస్థలు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాయి. రిలయన్స్ సంస్థ గుజరాత్‌లోని జామ్ నగర్ ప్లాంట్ నుంచి మహారాష్ట్రకు వంద టన్నుల ఆక్సిజన్ సరఫరాకు ముందుకొచ్చింది. ఐవోసీ కూడా ముందుకొచ్చింది. దీంతోపాటు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పరిస్థితిని అదుపు చేసేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 40 టన్నుల ఆక్సిజన్‌ను తెప్పిస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటించారు. కాగా దేశంలో అన్ని ఆసుపత్రులు, ప్రైవేటు ప్లాంట్‌లు, కలిపి రోజుకు సగటున 7, 127 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయగలవు. అయితే ప్రస్తుతం దాదాపు 7500 టన్నుల ఆక్సిజన్ అవసరం కానుంది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో..50వేల టన్నుల ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవడంతో పాటు 24గంటల పాటు ప్లాంట్ నడిచేందుకు అత్యవసర అనుమతులు ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మహారాష్ట్రకు ఆక్సిజన్ ట్యాంకర్ల సరఫరాకు భారత వాయుసేన సేవలను వినియోగించుకునేందుకు కూడా రక్షణశాఖ అనుమతించింది. త్వరలోనే ఆక్సిజన్ సరిపడా అందుతుందని ప్రకటించింది. ఆక్సిజన్ సరఫరా కోసం సిలిండర్లు, ట్యాంకర్ల కొరత లేకుండా చూససుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. కొన్ని ఆసుపత్రుల్లో అత్యవసరంగా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు శీఘ్ర అనుమతులతో పాటు పీఎం కేర్స్ నుంచి నిధులూ అందించనున్నట్లు తెలిపింది.
Must Read ;- కుంభమేళాపై కరోనా ఎఫెక్ట్ : 30 మంది నాగ సాధువులకు కరోనా