ఏపీలో వైద్యపరికరాల కొనుగోళ్లు కుంభకోణంలో సీఐడీ చురుగ్గా విచారణ జరుపుతోంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రల్లో ఈ సోదాలు సాగుతున్నాయి. విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రి, గుంటూరు, కర్నూలు ప్రభుత్వాసుపత్రుల్లో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లోని మరికొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా సోదాలు నిర్వహించారు. 2015 నుంచి మూడేళ్ల పాటు ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లిందని ఈ కుంభకోణంలో సూత్రదారులను పట్టుకునేందుకు సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ కుంభకోణంలో బెంగళూరుకు చెందిన టీబీఎస్ సంస్థకు వందల కోట్లు దోచిపెట్టారని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇందుకూరు వెంకట రామరాజు ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు జరుపుతున్నారు.
అవినీతిని నిగ్గుతేల్చేందుకేనా..
గుంటూరు, కర్నూలు ప్రభుత్వాసుపత్రుల్లో ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లను పీపీపీ పద్దతిలో సమకూర్చారు. అయితే కోటి 70 లక్షల విలువైన స్కానింగ్ మిషన్‌లను 3.5 కోట్లకు కొనుగోలు చేసినట్టు సోదాల్లో తేలింది. 159 వెంటిలేటర్లను ఒక్కొక్కటి రూ.7.10 లక్షలతో కొనుగోలు చేసి వాటిని రూ.11 లక్షలుగా చూపి రూ.17 కోట్లు దారిమళ్లించినట్టు విచారణలో గుర్తంచారు. వైద్య పరికరాల నిర్వహణలోనూ భారీ అవినీతి జరిగిందని సీఐడీ అధికారులు గుర్తించారు. వైద్య పరికరాల నిర్వహణ పేరుతో రూ.26 కోట్లు కాజేసినట్టు సోదాల్లో నిగ్గు తేల్చారు. ఈ కుంభకోణంపై లోతైన విచారణ జరిపించాలని రామరాజు హైకోర్టును ఆశ్రయించడంతో, ప్రభుత్వం ఈ కుంభకోణంపై మరలా విచారణ వేగవంతం చేసినట్టు తెలుస్తోంది.
Must Read ;- తవ్వేకొద్దీ దుర్గగుడిలో అక్రమాలు.. విజిలెన్స్ షాక్