ఉత్తరాంధ్ర జిల్లాలపై కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది.గత ఏడాది కరోనా దేశాన్ని, రాష్ట్రాన్ని వణికించినా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రం చాలా తక్కువ కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్‌లో మాత్రం రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదవుతూ అధికారులను సైతం హడలెత్తిస్తోంది.నిన్న ఒక్క రోజే ఉత్తరాంధ్ర జిల్లాల్లో 6 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ సహా ముగ్గురు సబ్ కలెక్టర్లు,ఆర్డీవో సహా అనేక మంది ఉన్నతాధికారులు కరోనా బారిన పడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
సెకండ్ వేవ్ ఎందుకొచ్చింది..
ఉత్రరాంధ్ర జిల్లాల నుంచి గత ఏడాది కరోనా కొంచెం తగ్గుముఖం పట్టగానే వేలాది మంది కార్మికులు హైదరాబాద్, కోల్ కతా, చెన్నై, బెంగళూరు నగరాలకు కూలీ పనులకు తరలివెళ్లారు. ఏప్రిల్ మాసంలో సెకండ్ వేవ్ రాగానే వారంతా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం చేరుకున్నారు. ఇలా దాదాపు 6 లక్షల మంది కూలీలు వలసలు వెళ్లిన వారు తిరిగి స్వస్థలాలకు వచ్చారని అధికారులు అంచనా వేశారు. ఇలా కొందరు మహారాష్ట్ర నుంచి కూడా శ్రీకాకుళం చేరుకున్నారు. ఇలా వచ్చిన వారు కరోనాను మోసుకువచ్చారని వైద్యాధికారుల అధ్యయనంలో తేలింది. కూలీల రాకపై ఆంక్షలు లేకపోవడం లాక్ డౌన్ కూడా లేటుగా వేయడంతో పొరుగు రాష్ట్రాలకు కూలీ పనులకు వెళ్లిన ప్రతి కూలీ తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు.ఇలా రావడంతోనే ఈ జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపించిందని వైద్యాధికారులు తేల్చారు.
మరణాలు కూడా ఇక్కడే ఎక్కువ
కరోనా పాజిటివిటీ రేటు ఏపీలో 20 శాతం ఉండగా, ఉత్తరాంధ్రలో 25 శాతం ఉందని తేలింది. అంటే పరీక్షలు నిర్వహించిన ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బారిన పడ్డారని డాక్టర్లు చెబుతున్నారు.ఇప్పటికే ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 60 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. వీరిలో 40 వేల మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచితే లక్షదాకా కరోనా పాజిటివ్ కేసులు బయటపడే ప్రమాదం ఉందని వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరినీ గుర్తించేందుకు వాలంటీర్లతో ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటిలో సర్వే చేసి ఎవరైనా జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? గుర్తించి వారికి కరోనా టెస్టులు చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాబోయే పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది.
బెడ్లు లేవు,ఆక్సిజన్ అందదు
విశాఖ జీజీహెచ్ కరోనా రోగులతో నిండిపోయింది.కనీసం బెడ్ కూడా దొరకడం లేదు. ఇక శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేక రోగులు గగ్గోలు పెడుతున్నారు. ఆసుపత్రుల ఆవరణలో వందల సంఖ్యలో కరోనా రోగులు బెడ్లు కోసం ఎదురు చూస్తున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఆసుపత్రికి వచ్చిన రోగులకు కూడా కనీసం బెడ్లు కేటాయించలేక వైద్యాధికారులు చేతులెత్తేశారు. దీంతో చాలా మంది రోగులు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటున్నారు.వారు ఆరోగ్యం సీరియస్‌గా మారాక ఆసుపత్రులకు పరుగులు తీసినా, వారికి ఆక్సిజన్ అందడం లేదు. దీంతో గడచిన వారం రోజుల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో 300ల మందికిపైగా కరోనా రోగులు చనిపోయారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇంకా ఎక్కువే మరణాలు ఉన్నాయని తేలింది. ఈ గణాంకాలు కేవలం ప్రజలు ఆందోళనకు గురికాకుండా తగ్గించి చెబుతున్నట్టు తెలుస్తోంది. ఒక్క విశాఖ నగరంలోని ఓ స్మశాన వాటికలో రోజుకు 60 కరోనా శవాలను దహనం చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
పరిష్కారం లేదా?
ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోగిని గుర్తించి మందుల కిట్ అందజేయాలని, సీరియస్‌గా ఉంటే అత్యవసర సేవలు అవసరం అయిన వారికి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిచాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ కరోనా రోగులు దాదాపు మూడు జిల్లాల్లో 60 వేల మంది ఉంటే బెడ్లు మాత్రం కేవలం 6 వేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో కరోనా రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేందుకు వెనకాడుతున్నారు. వారంతా యథేఛ్ఛగా తిరగడంతో మరింత మందికి కరోనా సోకుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని కరోనా రోగులందరినీ ఐసోలేట్ చేయాలని వైద్య నిపుణులు విజ్ఙప్తి చేస్తున్నారు.