జూ.ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ క్రేజీ మల్టీస్టారర్ తాజా షెడ్యూల్ పూర్తయింది. కోవిడ్ కారణంగా చాలా రోజులుగా ఆగిపోయిన చిత్రీకరణను అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఆ మధ్య తిరిగి మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. గత 50 రోజులుగా హైదరాబాద్లో జరుపుతున్న తాజా షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం సోషల్ మీడియాలో తెలియజేసింది.
రాత్రి సమయాలలో వీటిని చిత్రీకరించినట్లు పేర్కొంది. తదుపరి షెడ్యూల్ కోసం సన్నద్ధమవుతున్నట్లు కూడా ప్రకటించింది. అయితే తదుపరి షెడ్యూల్ ఎక్కడ జరిపేది అందులో తెలుపలేదు. వినిపిస్తున్న చిత్ర పరిశ్రమ వర్గాల కథనం ప్రకారం పుణేలో కొత్త షెడ్యూల్ ఉంటుందని, జూ.ఎన్టీఆర్, రాంచరణ్ లు కూడా పూణేకు బయలుదేరుతారని అంటున్నారు. భారీ బడ్జెట్ తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.