( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద శుక్రవారం ఉదయం నుంచే యుద్ధవాతావరణం నెలకొంది. 32 మంది త్యాగధనుల ఫలితంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు… ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు, ట్రేడ్ యూనియన్లు కదం తొక్కాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ఎదురుగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. మూడేళ్ల క్రితం 10 శాతం వాటాల ఉపసంహరణతో మొదలైన ప్రైవేటీకరణ అడుగులు నూరు శాతానికి చేరుకోవడంతో ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తొలుత బైక్ ర్యాలీ నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వరకు చేరుకున్నారు. సుమారు ఏడు వేల మంది ఉద్యోగులు, అధికారులు, కార్మికులు, అంతా ఏకతాటిపైకి వచ్చి ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కాపాడుకుంటామని శపథం చేశారు. స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ సిఐటియు, ఏ ఐ టి యు సి, ఐ ఎన్ టి యు సి, టి ఎన్ టి యు సి… ఇలా అన్నీ యూనియన్ల ప్రతినిధులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ నిరసన గళం కేంద్రాన్ని తాకేలా నినాదాలు చేశారు. రాజకీయ ప్రముఖులు వీరికి మద్దతు పలికారు. విశాఖపట్నం ఎంపీ ఎం వి వి సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ బి వి సత్యవతి కార్మిక సంఘాల నేతలతో మాట్లాడారు. పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తి పరిశ్రమను కాపాడుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ఇతర రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. ప్రజాప్రతినిధులంతా రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఛలో అమరావతి టు.. ఢిల్లీ
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సంఘాలు భారీ కార్యాచరణ రూపొందిస్తున్నాయి. అవసరమైతే అమరావతి ముట్టడికి… అదేవిధంగా ఢిల్లీ ముట్టడికి వందలాదిగా ఉద్యోగులు తరలి వెళ్లడానికి చర్చలు జరుపుతున్నారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న సంస్థను.. అంతకుమించిన పోరాటాలతో కాపాడుకునేందుకు.. ప్రాణ త్యాగాలు చేసేందుకు సంసిద్ధమని హెచ్చరిస్తున్నారు.
Must Read ;- ‘విశాఖ ఉక్కు’కు ఎందరో ప్రాణత్యాగం.. మేల్కొనక పోతే అన్యాయమే